నేడు తిరుపతి-షిరిడీ రైలు ప్రారంభం

26 Dec, 2015 03:46 IST|Sakshi

తిరుపతి అర్బన్: చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాలకు చెందిన షిరిడీ భక్తుల చిరకాల కోరిక నెరవేరనుంది. తిరుపతి నుంచి షిరిడీ(సాయినాథ్ నగర్) వరకు కొత్తగా ఏర్పాటు కానున్న వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు శనివారం తిరుపతిలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాయలసీమలోని వివిధ పట్టణాలకు చెందిన లక్షలాది మంది సాయి భక్తులు షిరిడీ చేరుకోవాలంటే వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. ఈ విషయమై తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ చొరవ తీసుకుని అనేకసార్లు ఢిల్లీలో ప్రధానికి, రైల్వే మంత్రికి విన్నవించారు. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని చర్చించారు. చివరకు రైల్వే మంత్రి తిరుపతి-షిరిడీ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రెండు నెలల క్రితమే మౌఖిక సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో కొత్త రైలు శనివారం ప్రారంభం కానుంది. ఈ రైలు శనివారం ప్రారంభిస్తున్ననప్పటికీ అధికారికంగా జనవరి 5వ తేదీ నుంచి తిరుగుతుంది.  

 రైలు రాకపోకల వేళలివే..
► 17417 నంబరుతో ఈ రైలు ప్రతి మంగళవారమూ ఉదయం 7 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు షిరిడీకి(సాయినాథ్ నగర్) చేరుకుంటుంది.
► 17418 నంబరుతో షిరిడీలో ప్రతి బుధవారమూ రాత్రి 07.10 గంటలకు బయలుదేరి గురువారం రాత్రి 11.45కు తిరుపతికి చేరుతుంది.

మరిన్ని వార్తలు