ఆర్థిక ఆసరా..

17 Dec, 2015 01:23 IST|Sakshi
ఆర్థిక ఆసరా..

నేడు పెన్షనర్స్ డే
 
కొరిటెపాడు (గుంటూరు) : తలపండిన అనుభవం.. తలపడే ఉత్సాహం.. అనుభవాల పరవళ్లు.. అనుబంధాల సందళ్లు ఒకేచోట కావాలంటే అది కేవలం పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఇంట్లోనే కనిపిస్తాయి. జీవితాంతం ఎన్నో కష్టాలు పడి ముదిమి వయస్సులో మనుమలు, మనవరాళ్లతో ఆనందంగా గడిపే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్‌పైనే ఆధారపడి జీవిస్తుంటారు.    ఒక వ్యక్తి ఉద్యోగపరంగా సేవలు అందించి.. ఉద్యోగ విరమణ తర్వాత అతను అందుకునే జీవనాధారమే ఇది. అందుకే ఈ పెన్షన్ సేవలకు ప్రభుత్వం కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు కల్పించింది. ఇందులో భాగంగానే 1871వ సంవత్సరంలో దేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ చట్టాన్ని తెచ్చారు.ఈ చట్టం జారీ అయిన డిసెంబర్ 17వ తేదీనే పెన్షనర్స్ డేగా జరుపుకొంటున్నారు.
 
పెన్షనర్ల పెద్ద మనసు
 నేటి పెన్షనర్లు అసోసియేషన్లుగా ఏర్పడి సమాజ సేవలో పాల్గొంటున్నారు. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పదుల సంఖ్యలో పెన్షనర్ల అసోసియేషన్లు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, పాఠశాలల్లో మౌలిక వసతులు, మురికివాడల ప్రజలకు సౌకర్యాలు కల్పించడం వంటివి చేస్తున్నారు. అయితే, పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఆర్థికపరమైన భద్రత కల్పించడంతో పాటు వారు చేపట్టే సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తే మరిన్ని            సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.
 
కంట్రిబ్యూషన్ పెన్షన్ విచారకరం
పెన్షన్ అనేది కేవలం ఉద్యోగి చేసిన సేవకు చెల్లించే జీవనాధారమే కాదు. వయోభారంతో రోజురోజుకూ కుంగిపోవడమే కాకుండా శారీరక, మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని కల్పిస్తున్న ఆర్థిక, భద్రతా చర్య. అయితే, నాటి పాలకులు భవిష్యత్తుకు భరోసా ఇస్తే నేటి పాలకులు కంట్రిబ్యూటర్ పెన్షన్ తేవడం ద్వారా భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టి పదేళ్లు అయినా దానికి సంబంధించిన మార్గదర్శకాలు  ప్రభుత్వం నిర్ణయించలేని అయోమయ స్థితిలో ఉందన్నారు. ఇది విచారకరం. పెన్షన్ మంజూరులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలి.       
 - ఈదర వీరయ్య, పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షుడు
 
నేడు వయోవృద్ధులకు సన్మానం
 విజయవాడ (పటమట) : పెన్షనర్స్ డేను పురస్కరించుకుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75ఏళ్లు దాటిన 14మంది వయోవృద్ధులను సన్మానిస్తున్నట్లు అసోసియేషన్ నగర కార్యదర్శి కేఎస్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరురోడ్డులోని ఆర్‌అండ్‌బీ కార్యాలయ ఆవరణలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. 1980వ సంవత్సరంలో పెన్షనర్లకు రావాల్సిన            ప్రయోజనాలపై డీఎస్ నగారా అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసి గెలిచారని, అప్పటి నుంచి పెన్షనర్లు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్నారని తెలిపారు. పెన్షనర్స్ డే రోజున ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆల్‌ఫ్రెడ్, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొంటారని ఆయన వివరించారు.
 
ముదిమి వయస్సులో జీవనాధారం

స్వాతంత్య్రానంతరం పౌరసేవలను విస్తృత పరచిన క్రమంలో పెన్షన్ చట్టానికి మరింత స్పష్టత వచ్చింది. దీనిని సామాజిక భద్రతకు సంబంధించిన అంశంగా భావించి.. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో  ప్రజలకు అందించిన అమూల్య సేవలకు గుర్తింపుగా పొందుతున్న అత్య వసర జీవనాధారంగా దీనిని పరిగణించింది. నేటి పాలకులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టి పెన్షనర్ల భవితను అంధకారంలోకి నెట్టారు.
 

మరిన్ని వార్తలు