దయచేసి చెప్పండి!

9 May, 2017 12:25 IST|Sakshi
దయచేసి చెప్పండి!

► నేడు ఎంపీలతో రైల్వే జీఎం సమావేశం
► పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చించాలి
► నిధుల సాధనకు ప్రయత్నించాలి
► కీలక భేటీకి బందరు ఎంపీ డుమ్మా!


పుష్కరాలకు మాత్రమే పని చేసే శాటిలైట్‌ స్టేషన్లు... ఏళ్ల తరబడి కొనసాగుతున్న డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు... కొలిక్కిరాని ఖాజీపేట–చెన్నై మూడో లైను మార్గం... అటకెక్కిన రైల్‌నీర్‌ ప్రాజెక్టు... పేదలకు అక్కరకురాని జన్‌ ఆహార్‌... విజయవాడలో కొనసాగుతున్న అవుటర్‌ కష్టాలు... బందరు పోర్టు, రాజధానికి నూతన రైలు మార్గాల ఏర్పాటు... ఇలా అనేక సమస్యలు విజయవాడ రైల్వే డివిజన్‌లో నెలకొన్నాయి.

స్టేషన్లలో వసతులు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం విజయవాడలో రైల్వే జీఎం జోన్‌ పరిధిలోని ఎంపీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మన ఎంపీలు, అధికారులు డివిజన్‌లోని సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టులను జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది.


రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ) : దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ డివిజన్‌ నుంచే అత్యధిక ఆదాయం లభిస్తుంది. ఈ డివిజన్‌లో 2016–2017వ ఆర్థిక సంవత్సరంలో రూ.4వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నిత్యం విజయవాడ మీదుగా 350కి పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 400 వరకూ గూడ్స్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత గల డివిజన్‌ను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. పాలకులు పెండింగ్‌ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపివేయడంతో డివిజన్‌కు మరింత అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం రైల్వే జీఎంతో పార్లమెంట్‌ సభ్యుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

శాటిలైట్‌ స్టేషన్ల ఊసేలేదు
విజయవాడ మెయిన్‌ స్టేషన్‌పై భారం తగ్గించేందుకు గుణదలను శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తామని కొన్నేళ్ల కిందట ప్రకటించారు. ఆ తర్వాత రోడ్డు కనెక్టివిటీ ఉంటేనే గుణదల స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కృష్ణా పుష్కరాల సమయంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కోట్లాది రూపాయలతో గుణదల, రాయనపాడు, కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ స్టేషన్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించారు. పుష్కరాల అనంతరం ఈ స్టేషన్లను పట్టించుకోవడం లేదు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన నేపథ్యంలో ఈ స్టేషన్లను అభివృద్ధి చేసి కొన్ని రైళ్లను అక్కడ నిలిపితేవిజయవాడ మెయిన్‌ స్టేషన్‌ రద్దీని కొంత మేరకు నివారించవచ్చు.

నత్తనడకన మూడో రైలు మార్గం పనులు
ఖాజీపేట–చెన్నై మూడో రైలు మార్గాన్ని 2012 బడ్జెట్‌లో ప్రకటించారు. నిధుల కొరత కారణంగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ లైను నిర్మాణానికి రూ.1,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. అయితే సర్వే నిమిత్తం కోటి రూపాయిలు మాత్రమే విడుదల చేయడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ లైను నిర్మాణం పూర్తయితే ప్రతిపాదిత బుల్లెట్‌ రైళ్లు నడపవచ్చు. ఇవి గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో విజయవాడ మెయిన్‌ స్టేషన్‌లో ట్రాఫిక్‌ తగ్గడమే కాకుండా చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు గంటన్నర వ్యవధిలోనే చేరుకోవచ్చు.

అటకెక్కిన రైల్‌ నీర్‌ ప్రాజెక్టు
రైల్వే బడ్జెట్‌–2012లో విజయవాడకు ప్రకటించిన రైల్‌ నీర్‌ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్న చందంగా మారాయి. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ సమీపంలో ఈ ప్రాజెక్టు నెలకొల్పడానికి అన్ని శాఖల నుంచి అనుమతులు లభించాయి. అయితే లీజు విషయంలో వివాదం కారణంగా ప్రాజెక్టు అటకెక్కింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది.

జన్‌ ఆహార్‌ను విస్తరించాలి
పేద, మధ్య తరగతి ప్రయాణికులకు తక్కువ ధరకు ఆహారాన్ని అందించేందుకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ జన్‌ ఆహార్‌ పథకం ప్రవేశపెట్టారు. ప్రారంభ సమయంలో దశల వారీగా డివిజన్‌లోని ఇతర స్టేషన్లకు విస్తరిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు విస్తరణకు నోచుకోలేదు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జన్‌ ఆహార్‌ స్టాళ్లను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.

వేధిస్తున్న ఇంజిన్ల కొరత
డివిజన్‌లో రైలు ఇంజిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. నిర్ణీత కిలోమీటర్లు తిరిగిన అనంతరం ఒక్కో ఇంజిన్‌కు ఓవర్‌ హాలింగ్‌కు పంపాలి. ఇంజిన్ల కొరత నేపథ్యంలో తుప్పు పట్టిన ఇంజిన్లనే ప్రయాణికుల రైళ్లకు వాడుతున్నారు. దీని వల్ల ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది.

ఉద్యోగాల భర్తీ ఊసే లేదు
డివిజన్‌లోని వివిధ విభాగాల్లో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం డివిజన్‌లో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు సమాచారం. సిబ్బంది కొరత వల్ల ఆ ప్రభావం ప్రయాణికుల సేవలపై పడుతోంది. వాణిజ్య, భద్రత విభాగాల్లో ఖాళీలను తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

నేను సమావేశానికి వెళ్లడం లేదు : ఎంపీ కొనకళ్ల
రేపల్లె–బాపట్ల–ఒంగోలు వరకు మచిలీపట్నం రైలు మార్గానికి లింకు కలపాలని తాను ప్రతిపాదించినట్లు బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 9వ తేదీన విజయవాడలో జరగనున్న రైల్వే శాఖ సమీక్షా సమావేశానికి తాను హాజరుకావడం లేదని చెప్పారు. అయితే ఈ సమవేశంలో చర్చించేందుకు తాను ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

ఒత్తిడి చేయాలి
పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల కోసం రైల్వే బోర్డుపై పార్లమెంట్‌ సభ్యులు ఒత్తిడి తేవాలి. గతంలో ఇటువంటి సమావేశాలు  తూతూ.. మంత్రంగా ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. డివిజన్‌కు ఒక్క ప్రాజెక్టు సాధించలేకపోయారు. విజయవాడ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలి. రాజధాని నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తూంటారు. వారి ప్రయాణ నిమిత్తం విజయవాడ–గుంటూరు మధ్య మరిన్ని సర్క్యులర్‌ రైళ్లను నడపాలి. – జీఎన్‌ శ్రీనివాసరావు, రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ డివిజనల్‌ కార్యదర్శి

పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించాలి
డివిజన్‌లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కల్పించేందుకు పార్లమెంట్‌ సభ్యులంతా కృషి చేయాలి. ఇక్కడ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే దాదాపు 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రాజధాని నేపథ్యంలో విజయవాడ నుంచి అన్ని ప్రధాన నగరాలకు రైళ్లను నడపాలి. విజయవాడ–గుడివాడ, మచిలీపట్నం–నరసాపురం, డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి. కొత్తగా బందరు పోర్టు ఏర్పాటు కానుండటంతో పనులు వేగంగా చేపట్టాలి. – బండ్రెడ్డి వెంకట చలపతిరావు, రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ డివిజనల్‌ కార్యదర్శి 

మరిన్ని వార్తలు