నేడు రిజిస్ట్రేషన్లు బంద్‌..!

31 Jul, 2016 23:28 IST|Sakshi
– ఇళ్లు, భూమి విలువ 30 శాతం పెంపు
– కర్నూలులో ఆన్‌లైన్‌ కాని వివరాలు
 – సోమవారం నుంచి పెంపు అనుమానమే...!
 
కర్నూలు: ఇళ్లు, భూముల విలువ పెరగడం..అందుకు అనుగుణంగా ఆన్‌లైన్‌ వివరాలు కాకపోవడం.. తదితర కారణాలో సోమవారం జిల్లాలో రిజిస్ట్రేషన్లు బంద్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగష్టు ఒకటో  తేదీ నుంచి భూమి విలువ 20 నుంచి 30 శాతం పెంచుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

శనివారం పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ కావడం, ఆదివారం సెలవు రోజు కావడంతో ఆన్‌లైన్‌లో పెంపు వివరాలను నమోదు చేయలేకపోయారు. దీనికితోడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ సైతం కర్నూలులో లేకపోవడంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో సోమవారం(ఒకటో తేదీ) నుంచి పెంపు అమలు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ కారణంగా సోమవారం రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదు. పాత రేట్ల ప్రకారం సైతం కొత్త రిజిస్ట్రేషన్లు చేయకూడదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పెంపు వివరాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం సాధ్యం కాదని ఓ అధికారి తెలిపారు. ఈ కారణంగా సోమవారం నుంచి గాకుండా మంగళవారం నుంచి కొత్త రిజిస్ట్రేషన్లు ఉండే అవకాశం ఉంది. ఈ విషయమై ఇన్‌ఛార్జి జిల్లా రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పెరిగిన రేట్లు నమోదు చేయడానికి తమకు 5 రోజులు సమయం ఉంటుందని, ఈలోపు ప్రాంతాన్ని బట్టి 15 నుంచి 20 శాతం పెంచి రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో 24 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా.. వీటి పరిధిలో ప్రతిరోజూ ఒక్కో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సగటున రోజుకు భూములు, ఇళ్లు, స్థలాలకు సంబంధించి 30 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి.
 
మరిన్ని వార్తలు