కేబినెట్‌ అజెండాపై నేడు స్క్రీనింగ్‌ కమిటీ భేటీ

9 May, 2019 05:13 IST|Sakshi

నాలుగు అంశాలపై నోట్‌ పంపాలని శాఖలకు సీఎస్‌ ఆదేశం

కమిటీ పరిశీలన అనంతరం సీఈవో ద్వారా ఈసీకి వివరాలు

ఈసీ నుంచి అనుమతి వస్తేనే కేబినెట్‌ భేటీకి ఓకే

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన నిర్వహించ తలపెట్టిన మంత్రి మండలి సమావేశం అజెండాపై పరిశీలనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదించిన మంత్రివర్గ సమావేశం అజెండాలోని అంశాలపై సవివరమైన నోట్స్‌ పంపాలని ఆయా శాఖలకు సీఎస్‌ బుధవారం యువో నోట్‌ జారీ చేశారు.

సవివరమైన నోట్‌ పంపాలని శాఖలకు ఆదేశం
ఫొని తుపాను సహాయక చర్యలపై సవివరమైన కేబినెట్‌ అజెండా నోట్‌ను రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు పంపాలని రెవెన్యూ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌), ఆర్టీజీఎస్‌లను సీఎస్‌ ఆదేశించారు. తాగునీటిపై సవివరమైన కేబినెట్‌ అజెండా నోట్‌ సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, కరువు,  ఉపాధి హామీకి సంబంధించి కేబినెట్‌ అజెండా నోట్‌ పంపాలని ఆయా శాఖలకు సూచించారు.

‘కోడ్‌’ ఏం చెబుతోందంటే...
ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఈసీ ఆదేశాలకు అనుగుణంగా కేబినెట్‌ అజెండా అంశాలను అధ్యయనం చేసేందుకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో స్క్రీనింగ్‌ కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు  సంబంధిత శాఖల ముఖ్యకార్యదర్శులు  ఇందులో పాల్గొంటారు. కేబినెట్‌ అజెండా అంశాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉన్నాయా లేదా? అనే విషయాన్ని స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే బిజినెస్‌ రూల్స్, నిబంధనల మేరకు కేబినెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఆ అంశాలకు ఉందా లేదా అనేది కూడా స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తి రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి సంబంధిత ఉన్నతాధికారులు, సీఎస్‌తో సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చని ఎన్నికల ప్రవర్తన నియమావళి స్పష్టం చేస్తోంది.

ఈ నేపథ్యంలో కేబినెట్‌ అజెండాను సీఎస్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపనున్నారు. ఈనెల 14న కేబినెట్‌ సమావేశం ఉంటుందా లేదా? అనేది కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీసుకునే నిర్ణయంపైన ఆధారపడి ఉంటుందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. స్క్రీనింగ్‌ కమిటీ పంపే అజెండా నోట్‌పై సందేహాలుంటే ఈసీకి వివరణ పంపాల్సి ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు