ప్రేమ ముద్ద..!

21 Oct, 2017 14:00 IST|Sakshi

నేడు భగినీ హస్తభోజనం

విందు కోసం సోదరిల ఇళ్లకు వెళ్లనున్న అన్నదమ్ములు

వేటపాలెం : దీపావళి అనగానే చీకట్లను తరిమే కాంతి గుర్తుకు వస్తుంది. చెడుపై విజయం సాధించిన మంచి మదిలో మెదులుతుంది. తెలుగు లోగిళ్లలో దీపపు కాంతి కనిపిస్తుంది. అలాగే ఈ వేడుకలో భగినీ హస్తభోజనానికీ చోటు ఉంటుంది. భగినీ అంటే సోదరి అని అర్థం. సోదరి చేతివంట తినడం భగినీ హస్తభోజనం. ఇది దీపావళి వెళ్లిన రెండోరోజు వస్తుంది. దీనినే యమ ద్వితీయ అని కూడా అంటారు. వేటపాలెంలో ఈ వేడుక ప్రతి ఏటా ఉల్లాసంగా జరుగుతుంది. శనివారం యమ ద్వితీయ. అసలు దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి పాఠకుల కోసం ఈ కథనం.

యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె తన అన్న దగ్గరకు నిత్యం వెళ్లి.. తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని కోరేదట. నరకలోక పాలనతోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి తీరిక దొరకలేదు. కానీ ఎలాగైనా వెళ్లి తీరాలని సంకల్పించుకున్నాడు. చివరికి ఆయనకు కార్తీకమాసం, శుక్లపక్షం ద్వితీయతిధి నాడు విరామం దొరికింది. ఆరోజున సోదరైన యమున ఇంటికి వెళ్లాడు.

ఆనందించిన ఆమె తన అన్నకు షడ్రషోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు తన సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం యమధర్మరాజుకు కలిగింది. తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడామె ‘అగ్రజా నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినాలి. అంతేకాక ప్రతి సంవత్సరం కార్తీక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు తమ చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో అలాంటి వాళ్లకు నరకబాధ ఉండకూడదు’ అని వరం కోరింది. యముడు తథాస్తు అని వరమిచ్చాడు. నాటి నుంచి ఈ వేడుక ‘యమ ద్వితీయ, భ్రాతృ ద్వితీయ, అన్నదమ్మల భోజనాలు’గా ప్రసిద్ధి కెక్కాయి.

బాంధవ్యాల పటిష్టత కోసం..
భగినీ హస్తభోజనం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో మానవ జీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి కనుక కుటుంబాన్ని విడిచి జీవించలేడు. కుటుంబంలో తల్లిదండ్రులు ముఖ్యులు. కని, పెంచి, పోషించి విద్యాబుద్ధులను ప్రసాదిస్తారు. ఆ తర్వాత ఆత్మీయులైనవారు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్మల్లే. తల్లిదండ్రులు వయసులో పెద్దవారు కాబట్టి తమ సంతానం జీవించినంతకాలం వారు ఉండలేరు. అందుకే సోదరసోదరీలతో కలిసి ఏడాదికి ఒక్కసారైనా భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? అంతేకాక ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం కూడా ఉంటుంది. అలా ఈ అన్నదమ్ముల భోజన సంప్రదాయం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య జీవితాంతం ప్రేమాభిమానాలు ఉండే అవకాశం లభిస్తుంది.

దూరం పెరిగింది..
ఈ ఆధునిక కాలంలో ఉపాధి కోసం రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికొకసారి కాదు కదా రెండు, మూడేళ్ల వరకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలిసే అవకాశం ఉండటంలేదు. అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తే ఆత్మీయబంధాలు వర్థిల్లుతాయి. ‘ఆత్మావై పుత్రనామాసి’ అన్నది వేదం. అంటే తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువల్ల అక్కాచెల్లెళ్లు అమ్మకు ప్రతి రూపాలే. అమ్మ చేతివంట అమృతంకు సమానం అయితే అక్కాచెల్లెళ్ల చేతివంటకూడా సుధామయమే. ఆచారం ఎప్పుడూ దోషభూయిష్టమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణగల మానవులు తమ ఆచరణల్లో ఏయే లోపాలున్నాయో తెలుసుకుని వాటిని సవరించుకొని చక్కగా ఆచరించాలి. అదే విజ్ఞత.

మరిన్ని వార్తలు