అమాత్యా.. హామీలు గుర్తున్నాయా!

13 Apr, 2015 02:57 IST|Sakshi

♦ ఎక్కడి సమస్యలు అక్కడే
♦ సొంత జిల్లా ఆస్పత్రినే పట్టించుకోని వైనం
♦ పది నెలల్లో చేసింది శూన్యం
♦ నేడు మంత్రి కామినేని ప్రభుత్వాస్పత్రికి రాక

 
లబ్బీపేట : పదేళ్లలో వైద్యరంగం భ్రష్టుపట్టిపోయింది. వైద్యశాఖ భాగా పనిచేస్తుందని ఆ శాఖ మంత్రిగా నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. ఈ వ్యవస్థలను గాడిలో పెట్టాలి. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తా..వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలివి. నెల రోజులపాటు ఎక్కడికెళ్లినా ఇవే మాటలు చెప్పేవారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టి పది నెలలు గడిచిపోయింది. సొంత జిల్లాలోని బోధనాస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరై వైద్యులు, అధికారులు చెప్పిన సమస్యలన్నీ విన్నారు.

నెల రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీలు గుప్పించారు. కానీ సమావేశం జరిగి ఏడు నెలలు గడుస్తోంది. స్వయంగా వైద్య మంత్రే  హామీలివ్వడంతో నెరవేరుతాయని వైద్యులు ఆశగా ఎదురుచూశారు. కాని వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆయనిప్పుడు చెప్పేదొక్కటే.. ఆర్థికపరంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని. తాను పదవి చేపట్టాక అదనపు వైద్య సీట్లు రప్పించానంటూ ఊదరగొట్టే ప్రచారం చేశారు. కానీ వాటికనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో అవి కూడా రద్దయ్యాయి.

ఆస్పత్రి నిద్రలో సమస్యలు మరిచారు..
ఆస్పత్రి నిద్ర పేరుతో నెల రోజుల కిందట ఒక రోజు రాత్రి ఆస్పత్రిలో గడిపారు. అప్పుడు సిబ్బంది, రోగులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిలో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. సొంత జిల్లాలో ఉన్న ఆస్పత్రినే కామినేని అభివృద్ధి చేయలేక పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం మళ్లీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్నారు. మళ్లీ సమస్యల పాత రికార్డును వేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు.

మంత్రిగారూ వీటిపై దృష్టిపెట్టండి..
♦ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను100 నుంచి 150కి పెంచారు. దానికనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో మళ్లీ సీట్లు రద్దు చేస్తామని ఎంసీఐ లేఖ రాసింది. సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాలి.
♦ పెంచిన సీట్లకు అనుగుణంగా గతంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాసిన లేఖ ఆదారంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పిడియాట్రిక్  వంటి విభాగాలను పెంచా ల్సి ఉంది. దీని ద్వారా వైద్యులు, సిబ్బంది పెరగడంతో పాటు  పడకల సంఖ్య పెరిగి రోగులకూ మంచి వైద్యం అందే అవకాశం ఉంది.
♦ నవ్యాంధ్ర రాజధానిలో ఉన్న ఆస్పత్రిలో నేటికీ ఎంఆర్‌ఐ స్కానింగ్ పరికరం అందుబాటులోకి రాలేదు. దాని ఏర్పాటుకు కృషి చేయాలి. మరోవైపు రేడియోగ్రాఫర్స్ కొరత కారణంగా డిజిటల్ ఎక్స్‌రే మెషీన్ సమకూరినా పనిచేయించలేని దుస్థితి నెలకొంది.
♦ రెండు ఆపరేషన్ థియేటర్లు రెండేళ్లుగా మూతపడ్డాయి. ఆ రెండు ఆర్థోపెడిక్ విభాగానికి చెందినవి కాగా, కాలు విరిగి ఆస్పత్రికి వస్తే వారికి ఆపరేషన్ థియేటర్లు లేక వారం రోజులు సర్జరీ వాయిదా పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.  
♦ కాలిన గాయాలతో వచ్చిన వారికి చికిత్స చేసే బర్న్స్ వార్డు అస్తవ్యస్తంగా మారింది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయండి.
♦ రక్తపరీక్షల విషయంలో నేటికీ 24 గంటల లేబొరేటరీ అందుబాటులోకి రాలేదు. దీనికోసం ప్రత్యేక సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది.
♦ గుండెజబ్బు వచ్చిన వారికి పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేయాలి.
♦ ఇప్పటివరకూ ఐసీయూ అందుబాటులో లేక  ఏఎంసీ వంటి వార్డులో ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యాధునిక సౌకర్యాలతో ఐసీయూ ఏర్పాటు చేయడంతో పాటు  ప్రస్తుతం ఉన్న ట్రామా కేర్ వార్డులో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు