కౌన్సిల్‌కు రె‘ఢీ’

5 Aug, 2015 02:33 IST|Sakshi
కౌన్సిల్‌కు రె‘ఢీ’

- నేడు కౌన్సిల్
- కనకదుర్గ లేఅవుట్‌పైనే కీలక చర్చ
- యుద్ధానికి సిద్ధ మవుతున్న పాలకపక్షం
- అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న వైఎస్సార్ సీపీ
- ఎత్తుకు పైఎత్తులు
- కనకదుర్గ లే అవుట్‌పై మాట్లాడొద్దని హుకుం
- టీడీపీ కార్పొరేటర్లకు క్లాస్
- దుమ్మురేపుతామంటున్న వైఎస్సార్ సీపీ
విజయవాడ సెంట్రల్ :
పాలక, ప్రతిపక్ష పార్టీలు కౌన్సిల్ సమావేశానికి రె‘ఢీ’ అవుతున్నాయి. బుధవారం ఉదయం 10.30 గంటలకు మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 88 అంశాలతో అజెండా రూపొందించారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై  మంగళవారం టీడీపీ, వైఎస్సార్ సీపీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాయి. ఎంపీ కేశినేని నాని భవన్‌లో టీడీపీ సభ్యులు భేటీ కాగా, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థలోని తమ చాంబర్లో సమావేశమయ్యారు.  మూడు నెలల క్రితం కౌన్సిల్ జరిగింది. శ్రీ కనకదుర్గ సొసైటీ లే అవుట్‌ను ఆమోదించడంతో అధికారపార్టీ అవినీతి మకిలిని అంటించుకుంది. సొంతపార్టీ కార్పొరేటర్లే మేయర్ తీరును తప్పుబట్టడంతో రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసమ్మతి కార్పొరేటర్లకు దారికి తెచ్చే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది.
 
‘బొండా’ హుకుం!
బొండా ఉమా సెంట్రల్ నియోజక వర్గంలోని టీడీపీ కార్పొరేటర్లతో  సోమవారం రాత్రే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతిష్ట కాపాడాలని హితబోధ చేశారు. శ్రీ కనకదుర్గ సొసైటీ వ్యవహారంపై ఎవ్వరూ సభలో మాట్లాడవద్దంటూ తనదైన శైలిలో చెప్పారు. దీంతో కార్పొరేటర్లు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. కేశినేని భవన్‌లో జరిగిన భేటీకి 32 మంది టీడీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. మొక్కుబడిగా సంతకాలు చేసి సగం మంది వెళ్లిపోయిన ట్లు సమాచారం. పార్టీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరికి కొందరు కార్పొరేటర్లు మనస్తాపం చెందుతున్నట్లు భోగట్టా. గతంలో లే అవుట్ ఆమోదాన్ని తప్పుబట్టిన కార్పొరేటర్ల స్వరం మారుతోంది. అప్పట్లో అవగాహన లేక అలా మాట్లాడాం. ఇప్పుడు అంతా అర్థమైంది అంటున్నారు.  పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు లే అవుట్‌ను ఆమోదించి తీరాల్సిందేనన్న నిర్ణయానికి టీడీపీ కార్పొరేటర్లు వచ్చినట్లు సమాచారం.
 
తలొగ్గేది లేదు :  శ్రీ కనకదుర్గ లే అవుట్ ఆమోదాన్ని రద్దు చేయాలని సభలో పట్టుబట్టాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. నగరపాలక సంస్థకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఈ వ్యవహారంలో తలొగ్గేది లేదని ఫ్లోర్ లీడర్ బి.ఎన్.పుణ్యశీల విలేకరుల వద్ద  స్పష్టం చేశారు. ఇందులో అనేక లోపాలు ఉన్నాయన్నారు. భారీగా ముడుపులు ముట్టడం వల్లే అధికార పక్షం అడ్డగోలుగా తీర్మానం చేసిందని దుయ్యబట్టారు. ఇన్నాళ్ళు నీతి కథలు చెబుతున్న టీడీపీ అసలు రంగు బయటపడుతోందనారు. స్మార్ట్‌సిటీ పేరుతో కౌన్సిల్ అధికారాలను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తామని తెలిపారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎల్‌ఈడీ బల్బులు వెలుగులు చిమ్మడం లేదన్నారు. నిబంధనల ప్రకారం ప్రధాన అజెండా ఏడు రోజులు,  సప్లిమెంటరీ మూడు రోజుల ముందు అందించాల్సి ఉన్నప్పటికీ అండదం లేదన్నారు. నీటి, డ్రెయినేజిచార్జీలను తగ్గిస్తామని చెప్పి అడ్డగోలుగా పెంచేశారన్నారు. వీటన్నింటిపై పాలకపక్షాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు