నేడు జిల్లాకు రానున్న సుభాష్ పాలేకర్

28 Nov, 2013 02:39 IST|Sakshi

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మూడురోజుల శిక్షణ
 

వరంగల్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ప్రముఖ శాస్త్రవేత్త, బసవశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ గురువారం జిల్లాకు రానున్నారు. ప్రస్తుత వ్యవసాయ పద్ధతుల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ఆచరించాల్సిన మెరుగైన సాగు విధానం గురించి రైతులకు మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు.

రసాయన వ్యవసాయం నుంచి రైతులు బయటపడడానికి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆయన అవగాహన కల్పించనున్నారు. కాకతీయ ఫౌండేషన్, మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ రోడ్డు చింతగట్టు క్యాంపు వద్దనున్న బీజీఆర్ గార్డెన్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు కాకతీయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు నరహరి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనికి ఆత్మ, నాబార్డు శాఖలతోపాటు వ్యవసాయశాఖాధికారులు, శాస్త్రవేత్తలు సహకారం అందిస్తున్నట్టు చెప్పారు.

వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సుమారు వెయ్యిమంది రైతులు శిక్షణకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. మూడు రోజులపాటు వారికి బీజీఆర్ గార్డెన్స్‌లోనే ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇందుకోసం  వంద రూపాయలు నమోదు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలను అందజేస్తామన్నారు. గురువారం ఉదయం కలెక్టర్ కిషన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు