శతాబ్దాల చరిత... శౌరివారి ఘనత

3 Dec, 2015 00:48 IST|Sakshi
శతాబ్దాల చరిత... శౌరివారి ఘనత

నేడు పునీతశౌరీ వారి పండుగ
కులమతాలకతీతంగా నిర్వహణ

 
ఓలేరు (భట్టిప్రోలు) : గ్రామంలోని పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి దేవాలయ చరిత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. శౌరివారి ఆలయానికి రెండున్నర శతాబ్దాల ఘనత ఉంది. కులమతాలకతీతంగా శౌరివారి పండుగను గురువారం నిర్వహించుకుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ దేవాలయాన్ని 1784లో ఫాదర్ మానెంటి స్వాములు ఆధ్వర్యంలో  ఔస్ట్రీ స్వామి నిర్మించారు.  దేశంలో పునీతశౌరీ వారి పేరిట గోవా తరువాత రాష్ట్రంలో ఓలేరు, నరసరావుపేట, ముట్లూరు, మేళ్ళవాగు రెడ్డివారి పాలెం, కాట్రపాడు, నల్లపాడులో ఈ దేవాలయాలున్నాయి. ప్రస్తుతం ఓలేరు దేవాలయం శిథిలావస్థకు చేరింది. ఈ దేవాలయం సమీపంలో నూతన దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. గోవాలోని శౌరీ వారి  దేవాలయానికి వెళ్ళలేని భక్తులు ఓలేరులోని ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
 
వలసవెళ్ళిన క్రైస్తవులు...
 1787లో ఓలేరులో కరువు విలయతాండవం చేయడంతో ఇక్కడి క్రైస్తవులు తమిళనాడు పన్నూరు, కిలచేరి, చెంగలపట్నం, రాష్ట్రంలోని ముట్లూరు, కొండవీడు, పల్నాడు, తలబాడు ప్రాంతాలకు వలసవెళ్లారు.    స్పెయిన్ నుంచి తెప్పించిన శౌరీవారి ప్రతిమ ఓలేరులో ఉంది. 1959లో ఓలేరు విచారణ పునఃప్రారంభమైంది.   1960లో విచారణ కేంద్రం ఓలేరు నుంచి రేపల్లెకు బదిలీ చేశారు. ఈ దేవాలయ పునః ప్రతిష్టాపన 1988 ఫిబ్రవరి 14న గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ గాలిబాలి చేతుల మీదుగా జరిగింది. 1994 జూన్ 29న పునీత పేతురు పౌలు గార్ల పండుగ పర్వదినాన గుంటూరు మేత్రాసనంలోని రేపల్లె విచారణ నుంచి ఓలేరు విచారణగా ఆవిర్బవించింది.

బెంగళూరు శాఖలోని క్లరేషియన్ సంస్థకు ఓలేరు విచారణ అప్పగించారు. ఈ సందర్భంగా ఫాదర్ మాడపాటి జేమ్స్ మాట్లాడుతూ  ఏటా డిసెంబర్3వ తేదీన శౌరీ వారి పండుగను నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది హంగు, ఆర్బాటం లేకుండా దివ్యపూజా బలి నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు