‘స్థానిక’ సందడి

3 Jul, 2014 01:15 IST|Sakshi
‘స్థానిక’ సందడి
  •  నేడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక
  •  చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్
  •  పార్టీ బలాబలాల ఆధారంగానే
  •  గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడులు వైఎస్సార్ సీపీకి
  •  విజయవాడ సిటీ, మిగిలిన మున్సిపాలిటీలు టీడీపీకి
  • జిల్లాలో స్థానిక సంస్థలు కొలువుతీరనున్నాయి. ఎన్నికలు ముగిసిన దాదాపు మూడు నెలల తర్వాత స్థానిక పీఠాల అధ్యక్ష పదవులు ఎన్నిక ద్వారా భర్తీకానున్నాయి. గురువారం నుంచి శనివారం వరకు వరుసగా మూడు రోజులపాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నిక, పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. గురువారం మున్సిపల్ పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
     
    సాక్షి, విజయవాడ : స్థానిక సంస్థల అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. గురువారం విజయవాడ నగరపాలక సంస్థ మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రకియ జరగనుంది. జిల్లాలో ఈ ఏడాది మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

    విజయవాడ నగరపాలకసంస్థతోపాటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు, ఉయ్యూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించారు. కోర్టు ఆదేశాలతో మే 12న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. నగరపాలకసంస్థతోపాటు నందిగామ, మచిలీపట్నం, తిరువూరు  మున్సిపాలిటీల్లో  అత్యధిక స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఉయ్యూరు, పెడన హంగ్ కాగా.. వీటిలో పెడనను టాస్ పద్ధతిలో టీడీపీ కైవసం చేసుకుంది.

    నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేట మున్సిపాలిటీలను వైఎస్సార్ సీపీ  కైవసం చేసుకుంది. వార్డులపరంగా చూస్తే వైఎస్సార్‌సీపీకి, టీడీపీకి సమానంగా దక్కాయి. జిల్లాలో 218 వార్డులకు గానూ ఇతరులు 10 వార్డులు గెలుపొందగా వైఎస్సార్ సీపీ 104, టీడీపీ 104 స్థానాలను దక్కించుకుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఎన్నిక ప్రకియ లాంఛనంగా ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటలకల్లా పాలకవర్గాలు కొలువుతీరనున్నాయి. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికను రెండు రాజకీయ పార్టీలు దాదాపుగా ఖరారు చేశాయి. స్థానిక ప్రజాప్రతినిధే చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేసి అధిష్టానాల నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందారు. స్థానికంగా కొన్నిచోట్ల సమీకరణాలు సర్దుబాటు కాకపోవటంతో కసరత్తు సాగిస్తున్నారు.

    వైఎస్సార్ సీపీ అత్యధిక వార్డులు గెలుపొందిన నూజివీడు మున్సిపాలిటీకి చైర్మన్ అభ్యర్థిగా బసవా రేవతి పేరు ఖరారు చేశారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తన్నీరు నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ అభ్యరిగా ఎం.డి.అక్బర్, గుడివాడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అభ్యర్థిగా అడపా బాజ్జీని ఖరారు చేశారు. టీడీపీ పెడన, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం మున్సిపాలిటీలకు అభ్యర్థులను దాదాపుగా ఖరారుచేసింది.
     
    నేటి ఎన్నిక షెడ్యూల్..

    గురువారం ఉదయం 10 గంటలకు  రాజకీయ పార్టీల నేతలకు ఫారం ఏ, బీలను అందజేస్తారు. ఆ తర్వాత గెలుపొందిన కౌన్సిలర్, కార్పొరేటర్లలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.  మేయర్, చైర్మన్, డెప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లను పార్టీ బలాబలాల ఆధారంగా చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించి ఎన్నుకుంటారు. ఈ తంతును ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించిన అధికారులే నిర్వహిస్తారు.
     
    రేపు, ఎల్లుండి

    జిల్లాలోని 49 మండలాలకు మండల పరిషత్ అధ్యక్షులను శుక్రవారం ఎన్నుకోనున్నారు. శనివారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ అభ్యర్థులను ఎన్నుకుంటారు. పార్టీ సాధించిన జెడ్పీటీసీ స్థానాలను బట్టి జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు.
     

>
మరిన్ని వార్తలు