నేడే జెడ్పీ అధ్యక్ష ఎన్నిక

5 Jul, 2014 08:12 IST|Sakshi
  •  మధ్యాహ్నం వరకు నామినేషన్ల ప్రక్రియ
  •  3 గంటలకు చైర్‌పర్సన్ ఎన్నిక.. ప్రమాణ స్వీకారం
  •  చైర్‌పర్సన్‌గా గీర్వాణీ ఎన్నిక లాంఛనమే
  •  ఏర్పాట్లన్నీ పూర్తిచేసిన అధికార యంత్రాంగం
  • రెండు నెలల నిరీక్షణకు ఫలితం మరి కొన్ని గంటల్లో వెలువడనుంది. జిల్లాలోని 65 మంది జెడ్పీటీసీ సభ్యుల నుంచి ఒకరిని జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులుగా ఎన్నుకునే ప్రక్రియకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌గా చిత్తూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యురాలు గీర్వాణీ పేరు లాంఛనంగా ప్రకటించడమే తరువాయి.
     
    చిత్తూరు (అర్బన్) :  జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికకు అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు చేసింది. జెడ్పీ సమావేశ హాలులో శనివారం జరగనున్న చైర్‌పర్సన్ ఎన్నికకు జిల్లా కలెక్టర్ కే.రాంగోపాల్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. జిల్లాలోని 65 జెడ్పీటీసీలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం జెడ్పీటీసీ స్థానాలకు 266 మంది పోటీపడ్డారు. విజయం సాధించిన 65 మంది జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పలు కారణాల రీత్యా వాయిదాపడుతూ వచ్చాయి. రాష్ట్ర  ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడంతో శనివారం జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా యంత్రాగం సమాయత్తమయింది.
     
    మెజారిటీ జెడ్పీటీసీలు టీడీపీవే ...

    జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 37 చోట్ల విజయం సాధించింది. బుచ్చినాయుడుకండ్రిగ, బంగారుపాళెం, చిన్నగొట్టిగల్లు, చిత్తూరు, గుడిపాల, గుడుపల్లె, ఐరాల, కలకడ, కార్వేటినగరం, కుప్పం, కురబలకోట, కేవీబీ.పురం, ములకలచెరువు, నాగలాపురం, నగరి, నిండ్ర, పెద్దతిప్పసముద్రం, పాకాల, పలమనేరు, పాలసముద్రం, పెనుమూరు, పిచ్చాటూరు, పూతలపట్టు, రామచంద్రాపురం, రామకుప్పం, రేణిగుంట, శాంతిపురం, సత్యవేడు, సోమల, శ్రీకాళహస్తి, తవణంపల్లె, తొట్టంబేడు, తిరుపతి, వీ.కోట, వరదయ్యపాళెం, విజయపురం, ఎర్రావారిపాళెం జెడ్పీటీసీలను టీడీపీ  గెలుచుకుంది.
     
    27 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం

    బీ కొత్తకోట, బెరైడ్డిపల్లె, చంద్రగిరి, చౌడేపల్లె, గంగాధరనెల్లూరు, గంగవరం, గుర్రంకొండ, కేవీ పల్లె, మదనపల్లె, నారాయణవనం, నిమ్మనపల్లె, పెద్దమండ్యం, పెద్దపంజాణి, పీలేరు, పులిచెర్ల, పుంగనూరు, పుత్తూరు, రామసముద్రం, రొంపిచెర్ల, ఎస్‌ఆర్ పురం, సదుం, తంబళ్లపల్లె, వడమాలపేట, వాల్మీకీపురం, వెదురుకుప్పం, యాదమరి, ఏర్పేడు జెడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. కలికిరిలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మద్దతుదారు, స్వతంత్ర అభ్యర్థి జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందారు.
     
    గీర్వాణీ ఎన్నిక లాంఛనమే...

    జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా తొలి నుంచి చిత్తూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యురాలు గీర్వాణీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈమె అభ్యర్థిత్వానికి ఒక దశలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అభ్యంతరం వ్యక్తంచేసినా, ఈమె పేరునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. దీంతో జెడ్పీ అధ్యక్షురాలిగా గీర్వాణీ ఎన్నిక లాంఛనమేనని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
     
    ఎన్నికల షెడ్యుల్ ఇదీ

    చైర్‌పర్సన్ పదవికి పోటీ చేసే జెడ్పీటీసీ అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలలోపు చిత్తూరులోని జెడ్పీ హాలులో నామినేషన్లు అందజేయాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 12 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఒంటి గంటకు జెడ్పీటీసీ సభ్యుల్ని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ హాలులోకి అనుమతిస్తారు. తొలుత ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. 3 గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహిస్తారు. వెనువెంటనే వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
     

మరిన్ని వార్తలు