వెబ్..డబ్..

17 Aug, 2014 02:05 IST|Sakshi
వెబ్..డబ్..
  •   నేటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపిక
  •   మొదటిసారిగా వన్ టైం పాస్‌వర్డ్ విధానం
  •   తొలి ప్రాధాన్య కళాశాలల వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి
  •   మొబైల్ ఇన్‌బాక్స్ ఖాళీ చేస్తే మేలు
  • విజయవాడ : తీవ్ర ఉత్కంఠత మధ్య ప్రారంభమైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపిక దశకు చేరుకుంది. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పునర్విభజన బిల్లులో పేర్కొన్న విధంగానే ఈ ఏడాది ఉమ్మడిగా ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు కౌన్సె లింగ్ ప్రక్రియను ప్రారంభించాయి.

    ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలి ఈ నెల 17నుంచి వెబ్ ఆప్లన్ల ఎంపికకు షెడ్యూల్ ప్రకటించింది. గతంలో జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియలో బ్రోకర్లు, కళాశాలల యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి అభ్యర్థులను తప్పుదారి పట్టించిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో స్క్రాచ్ కార్డును రద్దు చేసి వన్ టైం పాస్‌వర్డ్‌ను ప్రవేశపెట్టింది. వన్ టైం పాస్‌వర్డ్ విధానంలో డేటాను హ్యాకింగ్ చేసే అవశాశం ఉండదు.

    ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కోసం విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్ర లయోల కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. అభ్యర్థులు ఆయా హెల్ప్‌లైన్ సెంటర్లలోనే వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకుంటే మంచిది. ఈ ఏడాది నుంచి హెల్ప్‌లైన్ కేంద్రాల్లో విద్యార్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్సు కాపీలు అందజేస్తే సరిపోతుంది.
     
    వన్ టైం పాస్‌వర్డ్(ఓటీపీ) వల్ల ప్రయోజనాలు
     
    గతంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులకు ముందుగానే పాస్‌వర్డ్ ఉన్న స్క్రాచ్ కార్డును ఇచ్చేవారు. కౌన్సెలింగ్ పూర్తయి సీటు ఎలాంట్‌మెంట్ అయ్యేవరకు ఆ పాస్‌వర్డ్‌ను భద్రంగా ఉంచుకోవాల్సి వచ్చేది. అయితే బ్రోకర్లకు, కళాశాలల యాజమాన్యాలకు ఆ పాస్‌వర్డ్ ముందుగానే తెలియడం వల్ల అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కళాశాలల జాబితాను మార్చేసేవారు.
     
    ఈ పరిస్థితిని నివారించేందుకు వన్ టైం పాస్‌వర్డ్‌ను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో లాగిన్ అయిన వెంటనే వారు ముందుగా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరుకు పాస్‌వర్డ్ ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఈ విధంగా ఎన్నిసార్లు లాగాన్ అయితే అన్నిసార్లు మొబైల్ నంబరుకు వేర్వేరు పాస్‌వర్డ్‌లు వస్తాయి.
     
    ప్రలోభాలకు లొంగొద్దు
     
    ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించే హెల్ప్‌లైన్ సెంటర్లు, నెట్‌కేఫ్‌ల వద్ద బ్రోకర్లు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కళాశాలలకు సంబంధించిన బ్రోకర్లు, యజమానులు యూనిఫాం ఉచితమని, పాకెట్ మనీ ఇస్తామని, బస్‌పాస్ ఉచితమని ఆఫర్లు ఇస్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి మొదటి సంవత్సరం ఫీజులో సగం వెనక్కి ఇచ్చేస్తామంటూ ఆకర్షించేందుకు ప్రయత్నిసున్నారు. అటువంటి వారి ప్రలోభాలకు గురికాకుండా సరైన కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. సొంతగా అప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఏయే కళాశాలలను ప్రాధాన్యత ఇచ్చారనే విషయం బయటకు వెల్లడించకపోవడం ఉత్తమం.
     
    అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    వెబ్ అప్షన్లను ఎంపిక చేసుకునే సమయంలో మొబైల్ ఇన్‌బాక్స్‌ను ఖాళీగా ఉంచితే మేలు.
     
    కాలేజీ ఎంపిక చేసుకునేముందు అక్కడి సౌకర్యాలు, ఆధ్యాపకులు, లేబొరేటరీలు, ప్లేస్‌మెంట్ సౌకర్యం తదితర వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి.
     
    టాప్ కాలేజీల జాబితాతోపాటు నచ్చిన బ్రాంచిల లిస్ట్ కూడా సిద్ధం చేసుకుంటే మంచిది.
     
    ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు( ఏ రాష్ర్టంలో వాళ్లు ఆ రాష్ట్రంలోనే కళాశాలలు ఎంపిక చేసుకోవాలని కొందరు దళారులు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.)
     
    కాలేజీ, బ్రాంచిల ఎంపికకు సంబంధించి ఒక్కో ర్యాంకు వారికి రెండు రోజుల సమయం కేటాయించారు.
     
    మొదటి రోజు కొన్ని అప్షన్లు ఇచ్చి ఇతర కారణాల వల్ల లాగ్ అవుట్ కావాల్సి వస్తే ‘సేవ్’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
     
    వెబ్ ఆప్షన్లకు అదే చివరి రోజైతే సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి. అపుడు మాత్రమే ఎంపిక చేసుకున్న కళాశాలలు, బ్రాంచిల జాబితా సబ్‌మిట్ అవుతుంది.
     
    అప్షన్లు మార్పుకు మరో రోజు అవకాశం కల్పిచడం  జరిగింది.
     
    వన్ టైం పాస్‌వర్డ్ ఎంతో మేలు
    గతంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జరిగే సమయంలో కొందరు నెట్ సెంటర్ల యజమానులు కీ బోర్డుకు ప్రత్యేకమైన గాడ్జెట్‌ను అమర్చి పాస్‌వర్డ్‌ను తెలుసుకునేవారు. తద్వారా అప్షన్లు మార్చేవారు. కొత్త విధానంలో ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్ మారడం వల్ల అభ్యర్థి డేటాను తస్కరించేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. ఇది ఎంతో మేలు చేస్తుంది. అప్షన్లు ఎంపిక చేసుకునే ముందు అభ్యర్థి ప్రతి కళాశాల సమచారం తెలసుకోవడం మంచిది.
     - కె.శ్రీధర్, కంప్యూర్ సైన్స్ ఫ్యాకల్టీ, పీబీ సిద్ధార్థ కాలేజీ
     

మరిన్ని వార్తలు