ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే

30 Nov, 2019 05:14 IST|Sakshi

మహిళల రక్షణకు 100, 112, 1091, 181 టోల్‌ఫ్రీ నంబర్లు 

సైబర్‌ మిత్ర వాట్సప్‌ నంబర్‌తో తక్షణ సాయం

లొకేషన్‌ షేర్‌ యాప్‌లతో ఎప్పటికప్పుడు అలెర్ట్‌ మెసేజ్‌లు

యావద్దేశాన్ని షాక్‌కు గురిచేసిన ప్రియాంక రెడ్డి హత్యోదంతం

ఆపత్కాలంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు 

సాక్షి, అమరావతి :  అమ్మాయిలకు చదువెందుకన్న రోజులు మారాయి. అన్నింటా అతివలు సగమని ఆకాశానికెత్తే రోజులు వచ్చాయి. అయితే ఏం లాభం.. అర్థరాత్రి ఆడది నిర్భయంగా తిరగగలిగే రోజు రావాలని గాంధీజీ కోరుకున్న స్వాతంత్య్రాన్ని మాత్రం సాధించలేకపోయాం. దేశంలో అడుగడుగునా ఆడవాళ్లపై అకృత్యాలే.. నిర్భయలాంటి చట్టాలెన్ని వచ్చినా రోజుకో అత్యాచారం, హత్య వార్తలు కలచివేస్తున్నాయి. ఆడదంటే కోరిక తీర్చుకునే వస్తువని.. తమ పశువాంఛకు బలయ్యే అబల అని సమాజంలోని కొందరు మృగాళ్లు భావించినంత కాలం ఈ ఘోరాలకు అడ్డుకట్ట పడుతుందా? అందుకే మాటువేసి కాటేసే ఇలాంటి కామాంధులు పొంచిఉన్న సమాజంలో.. మగువలకు అప్రమత్తతే ఆయుధం.

ఆపద సమయాల్లో మహిళలు ఏమరుపాటుగా ఉండకుండా జ్రాగత్త పడాల్సిన అవసరాన్ని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యోదంతం తేటతెల్లం చేస్తోంది. ఆపత్కాలంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే సమయం లేనప్పుడు, ఏంచేయాలో కూడా అర్థం కాని స్థితిలో టోల్‌ఫ్రీ నెంబర్లు, లొకేషన్‌ షేర్‌ యాప్‌లు మహిళలకు కొండంత అండగా ఉంటాయి. 100, 112, 1091, 181 టోల్‌ఫ్రీ నంబర్లు, సైబర్‌ మిత్ర సెల్‌లు ఇలా ఎన్నో 24 గంటలూ ఆడవాళ్ల కోసం పనిచేస్తున్నాయి. మహిళలతోనే ఏర్పాటైన శక్తి బృందాలున్నాయి. 

ప్రమాదంలో ఉన్నామని భావిస్తే టోల్‌ఫ్రీ నంబరు 100కి కాల్‌ చేయండి. కాల్‌ సెంటర్‌లోని సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకుని వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. ఈ నంబరు ద్వారా తక్షణం పోలీసు సాయం పొందవచ్చు. 

1091 టోల్‌ ఫ్రీ నంబరు ప్రత్యేకంగా మహిళలు, చిన్నారుల కోసం పనిచేస్తోంది. ఆపద సమయాల్లో దీనికి కాల్‌ చేస్తే వెంటనే పోలీసు యంత్రాంగం అప్రమత్తమ
వుతుంది.

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 181 టోల్‌ ఫ్రీ నంబర్‌ పనిచేస్తుంది. గుంటూరులోని ఆ శాఖ డైరెక్టరేట్‌లో కాల్‌ సెంటర్‌ ఉంది. మహిళలు ఎదుర్కొంటున్న ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, గృహ హింస తదితర సమస్యలను చెబితే పరిష్కారం ఎలాగో చెప్పి సంబంధిత విభాగాలకు పంపుతారు. పోలీసు సాయం అవసరమైతే తక్షణం వారిని అప్రమత్తం చేస్తారు. 

ఫోన్‌ చేయగానే లొకేషన్‌ షేర్‌
దేశ వ్యాప్తంగా పనిచేసే 112 టోల్‌ ఫ్రీ నంబరుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసు హెడ్‌ క్వార్టర్లకు ఈ నెంబరు అనుసంధానమై ఉంటుంది. ఈ కాల్‌ సెంటర్లలో లొకేషన్‌ ఆధారిత సర్వర్లుంటాయి. కాల్‌ రాగానే నంబరు, లొకేషన్, కాల్‌ ఎక్కడ నుంచి వస్తుందో చిరునామా కూడా తెలుస్తుంది. 112కి ప్రత్యేకంగా వాహనాలుంటాయి. వాటి ద్వారా రక్షణ పొందవచ్చు. 

సైబర్‌ మహిళా మిత్ర 9121211100
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మహిళల రక్షణకు సైబర్‌–మహిళా మిత్ర పేరుతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం వాట్సప్‌ గ్రూపు ఏర్పాటుచేసింది. సైబర్‌ నేరాలే కాకుండా ఎలాంటి నేరాల గురించైనా ఈ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు. డీజీపీ, అన్ని జిల్లాల ఎస్పీలు కింది స్థాయి పోలీసు అధికారులు ఉన్న ఈ గ్రూపులో వచ్చే ఫిర్యాదులపై వెంటనే సంబంధిత అధికారులు లేదా సిబ్బంది స్పందించాలి. బాధితులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఫిర్యాదుపై ఈ గ్రూపులోనే ఎప్పటికప్పుడు స్టేటస్‌ ఇవ్వాలి. ఇవి కాకుండా ప్రతి జిల్లాలో ఉన్న వన్‌ స్టాప్‌ సెంటర్‌ (సింగిల్‌ విండో సెంటర్‌) ద్వారా మహిళలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తారు. సీఐడీ వెబ్‌ పోర్టల్‌లో ( www. cid. appolice. gov. in) మహిళలు, చిన్నారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉన్న ప్రత్యేక వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. 

అప్రమత్తతతో అపాయాన్ని తప్పించుకుందాం
అత్యవసర సమయాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, ఆపదల నుంచి బయటపడవేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిరంతరం పనిచేస్తోంది. టోల్‌ ఫ్రీ నంబర్లను ఫోన్లలో ఫీడ్‌ చేసుకుంటే ఇబ్బంది వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. మహిళలు అకస్మాత్తుగా ఇబ్బందుల్లో పడినా, అపరిచితుల వల్ల ప్రమాదం అని భావించినా భయపడకుండా కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు. క్లిష్ట సమయాల్లో భయపడకుండా ఏదో ఒక టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలి.     
    – కేజీవి సరిత, ఏఎస్పీ, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ 

మహిళలకు అండగా మరిన్ని యాప్‌లు
మహిళలు, పిల్లల రక్షణ కోసం కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.   VithU,  Circle of 6,  Life 360, I' m Shakti,   Family Locater ,  Nirbhaya Be fearless,  Watch over me వంటి యాప్‌ల ద్వారా తామున్న లొకేషన్‌ను రెండు నిమిషాలకోసారి షేర్‌ చేయవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఎప్పటికప్పుడు అలెర్ట్‌ మెసేజ్‌లు వెళ్తాయి. 

మరిన్ని వార్తలు