నిజం నిప్పుల్లో సమాధి!

23 Oct, 2014 01:23 IST|Sakshi
నిజం నిప్పుల్లో సమాధి!

 పిఠాపురం :యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో దీపావళి తయారీ కేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటం అనేక మంది కార్మికుల జీవితాల్లో చీకటి నింపింది. నెల రోజులుగా అనేక మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. సోమవారం కూడా 30 మంది వరకు బాణసంచా తయారీలో నిగ్నమయ్యారు. దీపావళి ఇక మూడు రోజులే ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు దారులు వస్తారని భావించిన యజమాని అప్పారావు అతడి తల్లి లక్ష్మి బాణసంచా తయారీ కేంద్రాన్ని ఆనుకుని ఒక టెంట్ వేసి అక్కడ కొంత సామగ్రి ఏర్పాటు చేశారు. ఓ వైపు అమ్మకాలు సాగిస్తూనే, మరో వైపు షెడ్ లోపల పనిచేస్తున్న కార్మికులను పర్యవేక్షిస్తున్నాడు అప్పారావు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తల్లీ కొడుకులిద్దరూ భోజనాలు చేశారు.
 
 కార్మికులు భోజనాలు ముగించి మళ్లీ పనిలో నిమగ్నమయ్యారు. సమయం మూడు గంటలు దాటింది .. లోపల షెడ్డులో నాలుగు గోడల మధ్య ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా భారీ విస్ఫోటం .. టెంట్‌లో ఉన్నవారు ఏంజరిగిందో ఊహించే లోపే భారీ పేలుళ్లు, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న కార్మికులు. అయినా అప్పారావు లోనికి వెళ్లే సాహసం చేశాడు. ఇంతలో గోడ కాలిపై కూలిపోవడంతో ప్రాణాలను అరచేతపట్టుకుని అతడు పరుగులు తీశాడు. కొద్దిదూరం వెళ్లి చూస్తే కనిపించేదంతా అగ్నికీలలే. కార్మికుల ఆర్తనాదాలు బాంబు శబ్దంలో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో వచ్చిన శబ్దాలు, కమ్ముకున్న పొగలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. మందుగుండు సామగ్రి అంతా ఒక్కసారిగా పేలడంతో కార్మికుల శరీరాలు వంద మీటర్ల ఎత్తున ఎగిరిపడ్డాయి. ఏం జరిగిందో తెలుసుకుందామంటే చెప్పడానికి లోపల పనిచేస్తున్న వారెవరూ ప్రాణాలతో లేరు. కాలిన గాయాలతో బయటపడ్డ కొందరు జరిగిన విషయం చెప్పేందుకు నోరు మెదపలేని పరిస్థితి. వారిలో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మందుగుండు తయారీ కేంద్రంలో ప్రమాదం ఎలా సంభవించిందనేది ప్రశ్నార్థకంగా మిగలనుంది.
 
 షెడ్డు నిర్మాణం విరుద్ధమే
 తయారీకి ఉపయోగించే పదార్థాలు ఎప్పుడైనా పేలి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అటువంటి వాటిని తయారు, నిల్వ చేసే షెడ్లు గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేవిగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన మణికంఠ ఫైర్ వర్క్స్‌లో మాత్రం షెడ్డు చుట్టూ గోడలు ఉండడంతో గాలి, వెలుతురు లోనికి వెళ్లలేదు. దీని వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో పేలితే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని, చుట్టూ గోడలు ఉండడంతో విస్ఫోట తీవ్రత ఎక్కువగా ఉందని వారి వాదన.
 
 శోకసంద్రంలో మూడు గ్రామాలు
 మృత్యువాతపడిన కార్మికుల కుటుంబాల రోదనతో మూడు గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. 18 మంది మృతి చెందడంతో ఎక్కడ చూసినా గుండెలవిసేలా రోదిస్తున్న వారే కనిపిస్తున్నారు. వారిని
 ఆపడం ఎవరి తరం కావడం లేదు.
 

మరిన్ని వార్తలు