రేపు శారదాపీఠానికి సీఎం కేసీఆర్‌ రాక

22 Dec, 2018 13:43 IST|Sakshi

ఉదయం 12.15 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పీఠంలో ప్రత్యేక కార్యక్రమాలు

పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీర్వచనం తీసుకోనున్న తెలంగాణ సీఎం

విశాఖపట్నం, పెందుర్తి: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠాన్ని సందర్శించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరనున్న సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శారదాపీఠానికి చేరుకుంటారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ ఆశీర్వచనం తీసుకుంటారు. పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపు రెండు గంటలసేపు పీఠంలోనే కేసీఆర్‌ గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు పయనమవుతారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి శారదాపీఠానికి రానుండడంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా... నిఘా వర్గాలు విస్తృత భద్రతపై దృష్టి సారించాయి. శనివారం ఉదయం నుంచి పెందుర్తి ప్రాంతం పూర్తిగా భద్రతా వర్గాల ఆధీనంలోకి వెళ్లిపోనుంది. మరోవైపు సీఎం కేసీఆర్‌కు స్వాగత ఏర్పాట్లపై శారదాపీఠం వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు స్వామీజీ ఆధ్వర్యంలో కేసీఆర్‌ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాదించించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు