పటిష్ట బందోబస్తు.. ట్రాఫిక్‌ మళ్లింపు

29 May, 2019 12:35 IST|Sakshi

రేపు సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం

హాజరుకానున్న వీవీఐపీలు, వీఐపీలు

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు

భారీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌

పార్కింగ్‌ ప్రాంతాల్లోనే వాహనాల నిలుపుదలకు చర్యలు

చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు తెనాలి వైపు మళ్లింపు

వివరాలు వెల్లడించిన అర్బన్‌ ఎస్పీ విజయరావు

గుంటూరు: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి వీవీఐపీలు, వీఐపీలు, రాజకీయ పార్టీల నేతలు భారీసంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వాహనాల పార్కింగ్‌ స్థలాలు, జాతీయ రహదారిపై వచ్చే వాహనాల దారి మళ్లింపు తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ సీహెచ్‌ విజయరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రాఫిక్‌ మళ్లింపు వివరాలు తెలిపారు.

అదనపు బలగాల మోహరింపు
జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గవర్నర్‌ ఎ.నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద కూడా అదనపు బలగాలను మోహరించడంతోపాటు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు గుంటూరు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలన్నింటినీ దారి మళ్లించడం, పార్కింగ్‌ స్థలాలకు తరలించే విధంగా ప్రణాళిక రూపొందించారు. కనకదుర్గమ్మ వారధి, ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వీవీఐపీలు, వీఐపీల భద్రతలో భాగంగా చర్యలు చేపట్టారు. నిఘా వర్గాల సూచనల మేరకు బందోబస్తును పటిష్టంగా నిర్వహించడంతోపాటు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.

నేటి అర్ధరాత్రి నుంచే..
బుధవారం అర్ధరాత్రి నుంచి చెన్నై నుంచి విజయవాడ వెపునకు వెళ్లే భారీ వాహనాలను వారధి సమీపంలోని బైపాస్‌ లేబై లలో  నిలిపివేయనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో నిలిపేలా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామ పరిధిలోని శ్రీనాథ్‌ ఇన్‌ఫ్రా వద్ద భారీ వాహనాలను నిలిపేలా చర్యలు చేపట్టారు. చెన్నై వైపు నుంచి జాతీయ రహదారిపై విజయవాడకు వచ్చే వాహనాలు నిలుపుకునేందుకు ఇష్టపడని వాహనాలకు అనుమతి ఇచ్చి గుంటూరు రూరల్‌ మండలం బుడంపాడు వైపుగా తెనాలి, రేపల్లె వైపు నుంచి కృష్ణా జిల్లాలోకి తరలించేలా ప్రణాళిక రూపొందించారు.

చుట్టుగుంట మీదుగా హైదరాబాద్‌కు..
గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనచోదకులు గుంటూరులోని చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల వైపుగా హైదరాబాద్‌ వెళ్లేలా ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టారు. ఒక వేళ అలా వెళ్లడం ఇష్టం లేని వారు ట్రాఫిక్‌ ఆంక్షలు ముగిసేవరకు కేటాయించిన పార్కింగ్‌ స్థలాల్లో వేచి ఉండేందుకు అనుమతిస్తారు. నార్త్, సౌత్‌ ట్రాఫిక్‌ సిబ్బందిని ఏర్పాటు చేయడంతోపాటు, సాయుధ దళ సిబ్బంది, ఏరియా డామినేషన్‌ టీమ్‌లు, బాంబ్‌ అండ్‌ డాగ్‌ స్క్వాడ్‌లు, రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీస్‌ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.

పార్కింగ్‌ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం
పార్కింగ్‌ స్థలాల్లో, ట్రాఫిక్‌ మళ్లింపు మార్గాలలో ప్రయాణికులకు, వాహనచోదకులకు ఎలాంటి ట్రాఫిక్‌ అవాంతరాలు కలుగకుండా ఉండేలా చేయడంతోపాటు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సౌకర్యాన్ని అందించేలా సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. హైవేపై గస్తీ వాహనాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పకటిప్పుడు సమాచారాన్ని కంట్రోల్‌ రూంకు చేరవేసేలా సిద్ధంచేశామని ఎస్పీ వివరించారు.

మరిన్ని వార్తలు