పిండేస్తున్నారు

12 Dec, 2013 04:01 IST|Sakshi
పిండేస్తున్నారు

=టమాట రైతుకు దళారుల టోకరా
 =జాక్‌పాట్ పేరుతో దోపిడీ
 =అధికారుల ప్రేక్షకపాత్ర

 
 టమాట రైతుల కష్టాన్ని దళారులు నిలువునా దోచుకుంటున్నారు . రాష్ట్రంలో అతిపెద్దదిగా పేరొందిన మదనపల్లె టమాట మార్కెట్లో దళారులు చెప్పిందే వేదం. అధికారులు సైతం వారికే వంత పాడుతున్నారు. ఆరుగాలం కష్టించిన రైతుకు దక్కే ప్రతిఫలం కంటే దళారులకే ఎక్కువ ఆదాయం వస్తోంది. అధికారుల అండదండలతో ఒక వైపు ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ మరో వైపు రైతన్నను దోచుకుంటున్న వైనంపై ప్రత్యేక కథనం.
 
మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె టమాట మార్కెట్‌కు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి సుమారు 300మంది రైతులు వస్తారు. సీజన్‌లో రోజు కు కోటి రూపాయల వరకూ వ్యాపారం జరుగుతుంది. ఒక్కోరైతు 25 నుంచి 30 క్రేట్‌ల (క్రేట్=30 కేజీలు) టమాటాలను తీసుకువస్తారు. రైతులు తీసుకువచ్చిన సరుకును నేరుగా విక్రయించే అవకాశం లేదు. కమీషన్ ఏజెంటు ద్వారానే విక్రయించాల్సి ఉంటుంది. ఏజెంట్లు ముందుగానే వ్యాపారులతో లావాదేవీలు జరిపి ఒప్పందం కుదుర్చుకుంటారు.

రైతుకి, వ్యాపారికి మధ్యవర్తిగా వ్యవహరించి ట మాటాల వేలం నిర్వహిస్తారు. ఇలా వేలం నిర్వహించినందుకు రైతు పది క్రేట్‌లకు గాను ఒక క్రేట్‌ను ఏజెంటుకు జాక్ పాట్ కింద ఉచితంగా ఇవ్వాలి. ఇలా 30 క్రేట్‌లు తెచ్చిన రైతు నుంచి జాక్‌పాట్ పేరుతో 3 క్రేట్‌ల టమాటాలను అప్పనంగా తీసుకుంటారు. అంతే కాకుండా క్రేట్‌ను రూ.500లకు విక్రయిస్తే అందులో కూడా పదిశాతం తగ్గించి రైతుకు నగదు ఇస్తారు. నిబంధ నల ప్రకారం నాలుగుశాతం మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా ఏజెంట్లు పదిశాతం వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని దశల్లోనూ దళారులు రైతన్నను దోచుకుంటున్నారు. అధికారులు అండదండలు ఉండడంతో దోపిడీకి అంతే లేకుండా ఉంది.
 
ప్రభుత్వానికీ టోకరా!

మార్కెట్‌లో రైతులను దోచుకుంటున్న దళారులు అధికారుల సహకారంతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. మార్కెట్లో దాదాపు 50 వరకూ మండీలు ఉన్నాయి. ఒక కమీషన్ ఏజెంట్ నెలకు సరాసరి రూ. 50 లక్షలు వ్యాపారం చేస్తే అధికారిక లెక్కల్లో మాత్రం పదిలక్షలుగానే చూపిస్తూ ప్రభుత్వాదాయానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రస్తుతం అధికారులు చూపుతున్న లెక్కల ప్రకారం సెస్, కమీషన్ ద్వారా మార్కెట్ యార్డుకు సరాసరి రూ. 1.5 కోట్లు ఆదాయం వస్తోంది. అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే యార్డు ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి రైతులు నిలువుదోపిడీకి గురికాకుండా చూడాల్సి ఉంది.
 
 జాక్‌పాట్ లేకుండా చేస్తా..
 మార్కెట్‌యార్డులో జాట్‌పాట్ పద్ధతి లేకుండా చేస్తా. ఇందు కోసం టమాటా రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తా. రైతులకు న్యాయం చేసేలా చేసేలా చర్యలు తీసుకుంటా. ఇందుకు రైతులు కూడా సహకరించాలి. అధిక కమీషన్ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం.
 -శ్రీరామ్ చినబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్, మదనపల్లె.
 

మరిన్ని వార్తలు