టమాట మార్కెట్‌లో ధర నాటకం

26 Aug, 2014 02:13 IST|Sakshi
టమాట మార్కెట్‌లో ధర నాటకం
  •      మండీ నిర్వాహకులు, వ్యాపారుల రింగ్
  •      ఒకే రోజు బాక్సుకు రూ.150 ధర తగ్గించిన వైనం
  •      కార్యాలయం వద్ద రైతుల ధర్నా
  • పలమనేరు : పలమనేరు టమాట మార్కెట్‌లో మండీ నిర్వాహకులు, వ్యాపారులు కలిసి టమాట ధర భారీగా తగ్గించేశారు. చుట్టుపక్కల ఉన్న మార్కెట్లతో పోలిస్తే బాక్సుకు రూ.150 దాకా వ్యత్యాసం వచ్చింది. ఆగ్రహిం చిన రైతులు మండీ యజమానులు, వ్యాపారులను నిలదీశారు.
     
    అసలేం జరిగిందంటే..

    పలమనేరు మార్కెట్‌కు రోజూ సరాసరి 30 లోడ్ల టమాటాలు వస్తుంటాయి. నెల నుంచి టమాట దిగుబడి పెరిగింది. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాల కారణంగా పంట దెబ్బతింది. దీంతో స్థానిక మార్కెట్‌కు వచ్చి టమాటాలు కొనుగోలు చేసేవారు. అందువల్ల మదనపల్లె, కర్ణాటకలోని వడ్డిపల్లె మార్కెట్లతో సమానంగా ఇక్కడ ధర ఉండేది. ఇలా అయితే గిట్టుబాటు కాదని భావించిన స్థానిక మండీ నిర్వాహకులు,  పొరుగు వ్యాపారులు కుమ్మక్కై ధరను నియంత్రించారు.
     
    రూ.వంద వ్యత్యాసం..
     
    మండీ నిర్వాహకులు, వ్యాపారులు కలిసి అనంతపురం జిల్లా నుంచి పది లోడ్ల టమాటాలు పలమనేరు మార్కెట్‌కు ఓ పథకం ప్రకారం తీసుకొచ్చారు. స్థానికంగా మరో 25 లోడ్లు మార్కెట్‌కు వచ్చాయి. అనంతపురం జిల్లా నుంచి తీసుకొచ్చిన టమాటాలు ఇక్కడి రైతులకు చూపెట్టి ఉన్నట్టుండి సరుకు భారీగా వచ్చేసిందని, అమాంతం ధర తగ్గించేశారు. సోమవారం కర్ణాటక రాష్ర్టం వడ్డిపల్లె మార్కెట్‌లో బాక్సు రూ.450 పలికింది. మదనపల్లెలోనూ దాదాపుగా అంతే పలికింది. ఆదివారం కూడా స్థానిక మార్కెట్‌లో రూ.380 పలికిన ధర వ్యాపారుల రింగుతో రూ.230కు పడిపోవడం తో రైతులు అవాక్కయ్యారు.
     
    రైతుల ఆగ్రహం
     
    స్థానికంగా ధర తగ్గించేందుకు వ్యాపారులు ఆడిన నాటకాన్ని రైతులు గుర్తించారు. ఏడాది పొడవునా తమ వద్ద కమీషన్లు తీసుకుంటూ ఈ విధంగా అన్యాయం చేయడం తగదంటూ మండీ నిర్వాహకులపై, వ్యాపారులపై మండిపడ్డారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గతంలోనూ కొన్నిసార్లు ఇదేవిధంగా ధర తగ్గించేశారని మార్కెట్ కమిటీ కార్యదర్శి సరళకుమారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా నుంచి రైతులు ఇక్కడికొచ్చి అమ్ముకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ధర తగ్గించడానికి నాటకమాడిన వ్యాపారుల లెసైన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
     

మరిన్ని వార్తలు