తగ్గుతున్న టమాట ధర

25 Aug, 2014 04:19 IST|Sakshi
తగ్గుతున్న టమాట ధర
  •      వారంలో కిలో రూ.12 తగ్గిన వైనం
  •      తగ్గిన ఎగుమతి.. పెరిగిన దిగుబడి
  • మదనపల్లె: మదనపల్లె టమాట మార్కెట్‌లో ధర రోజురోజుకూ తగ్గుతోంది. గత నెల కిలో రూ.50 పైన పలికిన టమాటాలు ప్రస్తుతం రూ.20 పలుకుతున్నాయి. గత వారం కిలో రూ.32 పలికిన టమాట ఆదివారం రూ.20కి పడిపోయింది. కాయల ఎగుమతి 50 శాతం వరకూ తగ్గడం, దిగుబడి 70 శాతం పెరగడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

    గడిచిన వారం రోజుల్లో ధరలను పరిశీలిస్తే 18న 10 కేజీల బుట్ట ధర మొదటి రకం రూ.320, రెండో రకం రూ.250, మూడో రకం రూ.180 పలికాయి. 19న మొదటి రకం రూ.300, రెండో రకం రూ.245, మూడో రకం రూ.170, 20న రూ.285, రూ.220, రూ.180, 21న రూ.300, రూ.245, రూ.190, 22, 23 తేదీలలో రూ.285, రూ.220, రూ.160 పలికాయి.

    ఆదివారం మొదటి రకం రూ.205, రెండో రకం రూ.150, మూడో రకం రూ.100 పలికాయి. 18న మార్కెట్‌కు 285 టన్నుల కాయలు రాగా ఆదివారం 363 టన్నుల కాయలు వచ్చాయి. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్ నుంచి విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కుంభకోణం, పాండిచ్చేరి ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.

    అన్ని చోట్ల పంట దిగుబడి ఉండడంతో వారం రోజులుగా ఎగుమతులు తగ్గాయి. పైగా అనంతపురం, కదిరి, పెద్దమండ్యం, గుంతకల్లు, లక్ష్మీపురం, రాయల్పాడు, శ్రీనివాసపురం, బి.కొత్తకోట, ముదిగుబ్బ, మడకసిర, పులివెందుల, కడప తదితర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు అధిక మొత్తంలో టమాటాలు వస్తున్నాయి. ఈ కారణంగా ధర పతనమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
     

>
మరిన్ని వార్తలు