తగ్గుతున్న టమాట ధరలు..

4 Aug, 2017 09:14 IST|Sakshi
తగ్గుతున్న టమాట ధరలు..
మదనపల్లె : గతకొద్ది రోజులుగా భగ్గుమన్న టమాట రేటు తగ్గుముఖం పట్టింది. ధరలు తగ్గుతుండడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల క్రితం కిలో ధర రూ.83 పలికిన మొదటి రకం టమాట. ప్రస్తుతం రూ.44కు పడిపోయింది. చిత్తూరుజిల్లా మదనపల్లె డివిజన్‌లోని తంబళ్లపల్లి, పీలేరు,  పుంగనూరు, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లి, రామసముద్రం తదితర మండలాలతోపాటు కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి, చిలగట్ట, రాయల్‌పాడు, శ్రీనివాసపురం, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో టమాట పంటను అధికంగా సాగుచేశారు. 
 
ప్రస్తుతం దిగుబడి వస్తుండడంతో కాయలను మదనపల్లె మార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెట్‌కు రోజూ 500 టన్నుల కాయలు వస్తున్నాయి. కాయల దిగుబడి పెరగడం, ఎగుమతులు తగ్గడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆరుగాలం శ్రమించి, రాత్రనక, పగలనక కష్టపడి పండించిన పంటకు ధరలు తగ్గుతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మొదటి రకం కాయలు రూ.40–45 మధ్య పలుకుతుండగా రెండో రకం రూ.30 నుంచి రూ.35, మూడో రకం రూ.20 నుంచి రూ.25 మధ్య పలుకుతున్నాయి.  
మరిన్ని వార్తలు