ట'మోత' తగ్గింది!

20 Dec, 2017 10:28 IST|Sakshi

గత నెలలో అందరినీ ఆందోళనకు గురి చేసిన టమాటా ధర అమాంతం పడిపోయింది. గత మూడు రోజులుగా ఒక్కసారిగా తగ్గిపోవడంతో రైతులు, వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ధరలు ఎంతగా పతనమయ్యాయంటే నవంబర్‌లో కిలో రూ.వంద నుంచి రూ. 120 పలికిన టమాటా నేడు 15 రూపాయలకు పడిపోయింది. ఇది కూడా ఉదయం మాత్రమే. సాయంత్రం అయ్యేసరికి ఈ ధర కూడా ఉండడం లేదు. పచ్చి సరుకును నిల్వ చేయలేక.. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం చందంగా.. వ్యాపారులు కిలో పది రూపాయలకు అమ్మేస్తున్నారు.

వీరఘట్టం: టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం అధిక దిగుబడిగా అంతా భావిస్తున్నారు. టమాటా సాగుకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, పాతపట్నం, హిరమండలం, శ్రీకాకుళం రూరల్‌ తదితర మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా ఉంది. వ్యాపారులు కూడా ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు టమాటాను దిగుమతి చేసుకుంటున్నారు. ఇవే ధర పతనానికి కారణమయ్యాయి. వ్యాపారులు కూడా రైతుల వద్ద కిలో రూ.7 నుంచి పది రూపాయల్లోపే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.  

ఎందుకిలా?
వాస్తవానికి సంక్రాంతి పండుగ సమీపిస్తుందంటే గతంలో టమాటా కిలో రూ.40 నుంచి రూ.50 పలికేది. ఈసారి పరిస్థితి తారుమారైంది. ఈ ఏడాది డిమాండ్‌కు మించి పంట దిగుబడి రావడంతో ధర పతనమైంది.

రోజుకు రూ.200  నష్టపోతున్నాం
పెట్టుబడులు పోను రోజుకు రూ.300 వరకు లాభం వచ్చేది. ప్రస్తుతం బేరాలు లేక సరుకు పాడవుతోంది.దీంతో రోజుకు రూ.200 వరకు నష్టం వస్తోంది. టమాటా వ్యాపారం చేయాలంటే ఆందోళనగా ఉంది.
– దేవుపల్లి గౌరీశ్వరరావు, వ్యాపారస్తుడు, వీరఘట్టం

అమాతంగా ధర తగ్గిపోయింది
టమాటాను నెల రోజుల క్రితం పార్వతీపురం, పాలకొండ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని స్థానికంగా విక్రయించేవాళ్లమి ప్రస్తుతం వీరఘట్టంలో విస్తారంగా పంట పండుతుండడంతో మార్కెట్‌లోకి ఎక్కువగా టమాటా దిగుమతి అవుతోంది. అంతేకాకా ఇతర ప్రాంతాల నుంచి కూడా టమాటా వస్తుండడంతో అమాంతంగా ధర తగ్గిపోయింది. 
– మీసాల ప్రసాదు, తోపుడు బండి వ్యాపారి

మరిన్ని వార్తలు