నో‘ట మాట’రాని రైతు

6 Jul, 2016 03:35 IST|Sakshi
నో‘ట మాట’రాని రైతు

మార్కెట్లో పతనమైన టమాట ధరలు
రూ.1000నుంచి రూ.100కు పడిన ధర
స్థానికంగా భారీగా పెరిగిన సరుకు
ధరలు మరింత తగ్గుతాయంటున్నవ్యాపారులు
అయోమయంలో రైతులు

 
టమాట ధరలు భారీగా తగ్గి సామాన్య జనానికి ఆనందం కలిగించినా రైతులను మాత్రం నట్టేట ముంచాయి. పది రోజుల క్రితం పలమనేరు టమాట మార్కెట్‌లో బాక్సు (14కేజీలు) ధర రూ.1000 లకు పైగా పలికి రికార్డు సృష్టించింది. అలాంటిది మంగళవారం స్థానిక మార్కెట్‌లో బాక్సు రూ.100 కు పడిపోయింది. స్థానికంగా సరకు పెరిగిపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు.  పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
 
పలమనేరు: మదనపల్లె మార్కెట్ తర్వాత టమాటకు పలమనేరు మార్కెట్ పెద్దది. ఇక్కడికి సరాసరిన రోజుకు 30 లోడ్ల టమాటాలు వస్తాయి. అలాంటిది ప్రస్తుతం 40కి పైగా లోడ్లు వస్తున్నాయి. సరకు ఎక్కువ కావడంతో స్థానిక మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి. అటు అనంతపూర్ జిల్లాలో, ఇటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ టమాట దిగుబడులు పెరిగాయి. దీంతో అక్కడి మార్కెట్లలో లోకల్ సరకు సరిపోయేంతగా వస్తోంది. దీంతో స్థానిక మార్కెట్‌నుంచి సరకును కొనేందుకు బయటి వ్యాపారులు ఆసక్తిని చూపడం లేదు. ఫలితంగా లోకల్ వ్యాపారులు మాత్రమే ఇక్కడి సరకును కొనాల్సిరావడంతో ధరలు అమాంతం పడిపోయినట్టు తెలుస్తోంది. గత నెలలో భారీగా ధరలు పలకడంతో స్థానిక రైతులు ధరలు ఇలాగే ఉంటాయనే ఆశతో భారీగానే టమాట సాగుచేశారు. ప్రస్తుతం 80శాతం తోటలు కోతదశలో ఉన్నాయి. ఇలా సరకు విపరీతం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టేందుకు ఓ కారణమైంది.

 పంట పెట్టుబడి కూడా అనుమానమే.
 ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరా పొలంలో పంట సాగుచేయాలంటే రూ.50వేలు అవుతోంది. ఇలాంటి తరుణంలో బాక్సు రూ.200 పలికితేగానీ పంటకు  పట్టిన పెట్టుబడి మిగిలేలా లేదు. ధరలు ఇలాగే మరింత తగ్గుముఖం పడితే రైతుకు తీరని నష్టం తప్పేలా లేదు.
 
టమాట పంటను సాగుచేస్తున్నా
కోత ఇప్పుడే ప్రారంభమైంది. మంగళవారం 60 బాక్సులు మార్కెట్‌కు తీసుకెళ్ళా. బాక్సు ధర రూ.110 దాకా పలికింది.  ఎప్పుడు ధరలుంటాయో అర్థం కాని పరిస్థితి. అంతా లాటరీగా మారింది.  రైతులంతా ఒకేసారి టమోటాను సాగుచేయడంతో సప్లయ్ పెరిగి అడిగే వారు లేకుండా పోతున్నారు.  -వెంకటమునిరెడ్డి, నక్కపల్లె
 
మార్కెట్‌కు అనుగుణంగా  టమోటాను సాగుచేయాలి
 ప్రస్తుత పరిస్థితుల్లో పంటసాగుకు ఖర్చులు పెరిగిపోయాయి.  సప్లయ్ భారీగా ఉంది. ఇలాంటి పరిస్థితులో ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలి. ధరలు ఉన్నాయని ఒకే పంటను సాగుచేస్తే సప్లయి పెరిగి డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి మార్కెట్ అనుకూలిత వ్యవసాయం చేయాలి. అప్పుడే రైతులు ఆర్థికంగా గిట్టుబాటుఅవుతుంది.
 -లక్ష్మీప్రసన్న, హెచ్‌వో, పలమనేరు డివిజన్
 
 

మరిన్ని వార్తలు