టమోటా @రూ.60

9 Nov, 2015 00:51 IST|Sakshi
టమోటా @రూ.60

విజయవాడ : జిల్లాలో టమోటా ధరలు చుక్కలు చూస్తున్నాయి. విజయవాడలో మార్కెట్‌లో కిలో ధర రూ.60కు చేరింది. వారం రోజులుగా మార్కెట్‌లో టమోటా కొరత ఏర్పడింది. ప్రస్తుతం జిల్లాలో దిగుబడి లేకపోవడమే దీనికి కారణమని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అనంతపురం, మదనపల్లి నుంచి విజయవాడ  మార్కెట్‌కు టమోటా సరఫరా అవుతోంది. అయితే కొద్ది రోజులుగా అనంతపురం, మదనపల్లి మార్కెట్ల నుంచి ఢిల్లీ, చెన్నయ్, తమిళనాడులోని పలు పట్టణాలకు టమోటా ఎక్కువగా సరఫరా అవుతోంది. ఆయా ప్రాంతాల్లో హోల్‌సేల్‌గానే ధర అధికంగా పలుకుతోంది.

దీంతో కృష్ణాజిల్లాతోపాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు మదనపల్లి నుంచి టమోటా సరఫరా పెద్దగా ఉండటంలేదు. తమిళనాడులో వర్షాల వల్ల టమోటా తోటలు దెబ్బతినడంతో అక్కడి వ్యాపారులు మదనపల్లి, అనంతపురం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు లేక పోవటంతో దిగుబడి ఆలస్యమై కొరత ఏర్పడింది. అనంతపురం, మదనపల్లిలో గ్రేడింగ్ చేసి నాణ్యమైన సరుకును అధిక ధరకు చెన్నై, ఢిల్లీకి ఎగువతి చేసి, నాసిరకం సరకు మనకు అంటగడుతున్నారని విజయవాడ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం విజయవాడ బహిరంగ మార్కెట్‌లో కిలో ధర రూ.60కి చేరింది. రైతు బజారుల్లో రూ.34 చొప్పున విక్రయిస్తున్నారు. విజయవాడ స్వరాజ్యమైదానంతో పాటు జిల్లాలో అన్ని రైతుబజార్లకు మూడు రోజుల నుంచి నాసిరకం టమోటా సరఫరా అవుతోంది. మంచి రకం టమోటాను బహిరంగ మార్కెట్లలో అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.

ఈ నెల రెండో తేదీ నుంచి టమోటా ధర పెరుగుతోంది. గత నెలలో కిలో రూ.19 చొప్పున రైతు బజారుల్లో విక్రయించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.25 చొప్పున ధర పలికింది. కొద్ది రోజుల్లోనే కిలో ధర రూ.60కి చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరో 10 రోజుల్లో జిల్లాలోనూ టమోటా ఉత్పత్తులు వస్తాయని, అప్పటి వరకూ ధరలు అధికంగానే ఉంటాయని మార్కెటింగ్ అధికారులు భావిస్తున్నారు.   

మరిన్ని వార్తలు