అ..ఆ..లు తెలియని ఊరు!

7 Sep, 2015 03:36 IST|Sakshi
అ..ఆ..లు తెలియని ఊరు!

అక్షర ప్రకాశం విజయవంతమైనందుకు
నాటి కలెక్టర్‌కు అవార్డు వచ్చింది..
దేశ వ్యాప్తంగా అభినందనలు అందాయి..
8న ఢిల్లీలో జరగనున్న అక్షరాస్యతా దినోత్సవానికి
లేటు వయసులో అ..ఆలు నేర్చిన ఉలవపాడు
మహిళలు హాజరు కానున్నారు..
సర్వశిక్షా అభియాన్ ఉంది.. సాక్షర భారత్
విద్యా కేంద్రాలూ ఉన్నాయి..
పటిష్టమైన విద్యాశాఖ ఉంది...
మరి.. పొదిలిలోని శ్రీపతి నగర్‌లో
సున్నా శాతం అక్షరాస్యత ఎందుకుంది?
 
- పొదిలిలోని శ్రీపతి నగర్‌లో నూరు శాతం నిరక్షరాస్యత
- ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం రేపు

పొదిలి పట్టణంగా విస్తరిస్తోంది.. కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయి. మేధావులు, ఉద్యోగులు, విద్యా సంస్థలకూ తక్కువ కాదు. అయితే దర్శి రోడ్డులో ఉన్న  శ్రీపతి నగర్‌ను పరిశీలిస్తే శతాబ్దం వెనుక ఉన్నామా అనిపిస్తుంది. కారణం? వారు అడవుల్లోనో.. జన సంచారంలేని చోట ఉండటమో కాదు. మనిషిని ముందుకు నడిపిస్తున్న చదువంటే అక్కడుండేవారికి తెలియకపోవడం. సున్నా శాతం అక్షరాస్యత ఉన్నా పాలకులు గుర్తించకపోవడం.. అధికారుల లెక్కల్లో లేకపోవడం.. జిల్లా యంత్రాంగం ఘోర తప్పిదం.

అక్కడ నుంచి ఓ వైపు  కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల, మరో వైపు ఎస్‌వీకేపీ డిగ్రీకళాశాల కాలనీ వాసులకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే అవి విద్యా సంస్థలని తమ తల రాతలు మార్చే జ్ఞాన జ్యోతులని వారికి తెలియదు. చెప్పేవారు లేరు.. పట్టించుకొనేవారే లేరు. కాలనీలో మొత్తం 30 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. వారిలో పెద్దలు 55 మంది కాగా, పిల్లలు 40 మంది ఉన్నారు. వీరంతా దాదాపు బడిఈడు పిల్లలే. ఈ చిన్నారుల్లో ఒక్కరు కూడా బడికి పోవటం లేదు. ప్లాస్టిక్, పాత పేపర్లు ఏరుకుంటూ అమ్మానాన్నల కడుపు కూడా నింపుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గానీ.. కార్మిక శాఖకు గానీ బాలలు కనిపించకపోవడం వారి దురదృష్టం.
 
అంతా యానాది సామాజికవర్గానికి చెందినవారే..
గతంలో పొదిలి చెరువు సివార్లలో నివాసం ఉండేవారికి ప్రభుత్వమే దర్శి రోడ్డులో పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసింది. తర్వాత శ్రీపతి నగర్‌గా నామకరణం చేసింది. ఇక్కడున్న వారందరికీ ఓటరు కార్డులున్నాయి. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులూ ఉన్నాయి. 15 ఏళ్ల నుంచి ఓటు హక్కూ వినియోగించుకుంటున్నారు. ఇంత జరిగినా ఇక్కడ ఓ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు ఎవరూ చొరవ తీసుకోలేదు. రేషన్ తీసుకోవాలన్నా.. పింఛన్లు తీసుకోవాలన్నా అంతా వేలిముద్ర వేయాల్సిందే! చిన్నారులంతా చిరిగిన దుస్తులతో.. అ..అంటే అమ్మ అని, ఆ.. అంటే ఆవు అని తెలియకుండానే పెద్దవాళ్లవుతున్నారు. అంగన్‌వాడీ బడిలో గుడ్లు తీసుకోకుండా.. పౌష్టికాహారం తినకుండా.. పూర్వ ప్రాథమిక విద్య నేర్చుకోకుండా పెరుగుతున్నారు.  సంతకం అంటే తెలియకుండానే వృద్ధులు కాటికె ళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.
-పొదిలి
 
ప్రమాదాలతో భయంగా ఉంది,
బడి చాలా దూరం, రోడ్డు వెంట నడిచి పిల్లలను బడికి పంపలేం. ఏ బండ్లు వచ్చి గుద్దుతాయోనని భయంగా ఉంది. ఓట్లు కోసం వస్తారు. ఇంకా పనులు చేయమని వస్తారు కానీ.. బడి గురించి ఎవరు పట్టించుకుంటారయ్యా!
-  మేకల సీతమ్మ
 
చీదరించుకుంటున్నారని వెళ్లటం లేదు
బళ్లో పిల్లలను చీదరించుకుంటున్నారని, పిల్లలు బడికి పోవటం లేదు. అప్పుడప్పుడు పంతుళ్లు వచ్చి పిల్లలను బడికి  రమ్మని అడుగుతారు. వీళ్లు వెళ్లటం లేదు. దగ్గరగా బడి కట్టిస్తే చదువుకుంటారు.
- మేకల కనకయ్య
 
మినీ అంగన్‌వాడీ కేంద్రం కావాలి
పిల్లలకు, గర్భిణులకు, బాలింతలు మంచి తిండి పెట్టేందుకు అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయా లి. పిల్లలకు చదువుతో పాటు, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
- కొమరగిరి రమణమ్మ

మరిన్ని వార్తలు