-

రేపు విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ

5 Nov, 2016 04:35 IST|Sakshi
రేపు విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ

ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు... ముస్తాబవుతున్న నగరం
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ ఉద్యమించి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్న ఘన చరిత్ర విశాఖపట్నం సొంతం. ఇప్పుడు అదే నగరంలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రాభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించనున్నారు.

విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే జై ఆంధ్రప్రదేశ్ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణానికి  స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం, సభా వేదికకు గురజాడ అప్పారావు పేరిట నామకరణం చేశారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది ఐదు కోట్లమంది ఉద్యమం
రాజధానిలో ఉద్యోగాలను దూరం చేసిన ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా 1972లో రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో యువత ప్రత్యేక రాష్ర్టం కోసం ‘జై ఆంధ్ర’ నినాదంతో మహోద్యమం సాగించిన సంగతి తెల్సిందే.  నేడు సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా లభించిన ‘ప్రత్యేక హోదా’ను పాలకులు నిరాకరించడం, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలను దూరం చేయడానికి నిరసనగా ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో జగన్‌మోహన్ రెడ్డి ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ‘యువభేరి’ సదస్సులతో యువతను చైతన్యపరుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఇపుడు ప్రత్యేక హోదా సాధన కోసం ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇపుడు ఈ ఉద్యమం ఐదు కోట్ల మంది ఆంధ్రుల చేతుల్లోకి వెళ్లింది.

ఏర్పాట్లను సమీక్షిస్తున్న విజయసాయిరెడ్డి
విశాఖ తరహాలోనే జై ఆంధ్రప్రదేశ్ సభలను రాష్ర్టవ్యాప్తంగా మరో ఐదు చోట్ల నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం విశాఖపట్నంలో పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, రాష్ర్ట ప్రొగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా తదితరులతో కలిసి మున్సిపల్ స్టేడియంలో సభఏర్పాట్లను పరిశీలించారు. ఆయన సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు దగా చేసిన తీరు, రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సభపై కక్ష సాధింపు
జై ఆంధ్రప్రదేశ్ సభ కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు విశాఖలోని ప్రధాన కూడళ్లు, రహదారులను పార్టీ జెండాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ జెండాలతో నిండిపోయాయి. అయితే నగర పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి జెండాలు, తోరణాల్ని తొలగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఓ పక్క జనచైతన్య యాత్రల పేరిట టీడీపీ చేపట్టిన కార్యక్రమాలకోసం నగరంలో ఎక్కడపడితే అక్కడ ఆ పార్టీ జెండాలు కడుతున్నా తొలగించని అధికారులు పనిగట్టుకుని వైఎస్సార్‌సీపీ జెండా లు, తోరణాలను తొలగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు