రేపట్నుంచి ‘స్థానిక’ పీఠాలకు ఎన్నిక

2 Jul, 2014 02:12 IST|Sakshi

3న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చైర్‌పర్సన్/మేయర్ల ఎన్నిక..
 4న మండల పరిషత్‌లకు, 5న జిల్లాపరిషత్‌లకు..


హైదరాబాద్: స్థానిక సంస్థల చైర్‌పర్సన్‌ల ఎన్నికలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చి నెలన్నర రోజులు దాటిన తరువాత చైర్‌పర్సన్‌ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 3న ఉదయం 11 గంటలకు మున్సిపల్/కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు, మేయర్లతోపాటు వైస్ చైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్‌ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మున్సిపాలిటీలు/ కార్పొరేషన్ల చైర్‌పర్సన్/మేయర్ ఎన్నికల్లో ఓటేయడానికి వార్డు సభ్యులు/డివిజన్ సభ్యులతోపాటు ఆ ప్రాంత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంట్ సభ్యులు అర్హులు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంటు సభ్యులు ఇందుకోసం తమతమ నియోజకవర్గంలోని ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో మొత్తం 53 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో చైర్‌పర్సన్‌ల ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్ సమయంలో సభ్యులు చేయి పెకైత్తడం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికలకు ఆయా జిల్లా కలెక్టర్లు నియమించిన అధికారులు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ముందుగా చైర్‌పర్సన్ ఎన్నిక.. తర్వాత వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుంది. ఏదైనా కారణంతో చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా పడిన పక్షంలో.. వైస్-చైర్‌పర్సన్ ఎన్నిక ఎట్టిపరిస్థితుల్లోనూ జరపడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అనివార్య కారణాలతో ఎన్నిక వాయిదాపడితే.. మరుసటి రోజు నిర్వహించాలని పేర్కొంది. మరుసటి రోజు కూడా సాధ్యపడని పక్షంలో.. ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని, ఎన్నికకు తదుపరి నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

మండల, జిల్లా పరిషత్‌లు...

తెలంగాణలోని 396 మండలాల చైర్‌పర్సన్‌లు, వైస్-చైర్‌పర్సన్‌లతోపాటు కో-ఆప్షన్ సభ్యులను ఈనెల 4న ఎన్నుకోనున్నారు. తెలంగాణలో మొత్తం 443 మండలాలు ఉన్నప్పటికీ.. ఎన్నికలు 441 మండలాలకు జరిగాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖమ్మం జిల్లాలోని మొత్తం మండలాలు, వరంగల్ జిల్లాలోని మంగపేట మండల చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో 396 మండలాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు.

 ముందుగా 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటలోగా కో-ఆప్షన్ సభ్యులను, తర్వాత మూడు గంటలకు మండల చైర్‌పర్సన్‌లు, వైస్-చైర్‌పర్సన్‌లను ఎన్నుకుంటారు. ఏవైనా కారణాలతో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదాపడినా... చైర్‌పర్సన్/వైస్ చైర్‌పర్సన్ ఎన్నికనూ వాయిదావేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అటు తెలంగాణలోని తొమ్మిది జిల్లా పరిషత్‌లలో.. ఖమ్మం మినహా మిగిలిన 8 జిల్లా పరిషత్‌లకు 5వ తేదీన చైర్‌పర్సన్‌ల ఎన్నికలు జరుగనున్నాయి.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా