పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత అరుణ

28 Sep, 2019 13:10 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి : మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్‌ చీఫ్‌ చలపతి భార్య అరుణను అంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతవారం జరిగిన గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్‌కౌంటర్‌లో గాయపడిన అరుణ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరుణతో పాటు గాయపడిన మరో మావోయిస్టు సభ్యురాలు భవానీ పెదబైలు దళానికి చెందిన సభ్యురాలిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన ఆమెను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కోలుకోవడంతో విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్‌ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. 

ఇక గతవారం గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు అరుణ కూడా ఉన్నట్లు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. అయితే అరుణ ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. కానీ ఆ వార్తలు అవాస్తమని పోలీసులు తేల్చిచెప్పారు. అయితే ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన  మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆరుణ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.

విశాఖ మన్యంలో కూంబింగ్‌ కొనసాగుతోంది: డీజీపీ
సాక్షి, అమరావతి : విశాఖ మన్యంలో ఇంకా కూంబింగ్‌ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్‌ భవాని గాయాలతో పోలీసులకి పట్టుబడినట్లు తెలిపారు.  మావోయిస్టు స్టేట్‌ జోన్‌ కమిటీ మెంబర్‌ జగన్‌ భార్య భవాని అని, పెదబైలు ఏరియా కమిటీ మెంబర్‌గా భవానీ పనిచేస్తోందన్నారు. 20 ఏళ్లుగా మావో ఉద్యమంలో వివిధ విభాగాల్లో ఆమె పనిచేసిందన్నారు. భవానిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరిలించినట్లు డీజీపీ వివరించారు. 

మరిన్ని వార్తలు