'ఏపీ కేబినెట్‌ అంతా నంద్యాలలోనే..'

14 Jul, 2017 18:43 IST|Sakshi
'ఏపీ కేబినెట్‌ అంతా నంద్యాలలోనే..'

కర్నూలు: టీడీపీ నేతలు కులాల వారీగా ప్రలోభాలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్‌ మొత్తం కూడా నంద్యాలలోనే ఉందని చెప్పారు. తాము చెప్పినట్లు వినకపోయినా, తమకు లొంగకపోయినా ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల సునీల్‌ కుమార్‌, అంజాద్‌ భాషాతో కలిసి కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నంద్యాలలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు.

మూడేళ్లలో నంద్యాలకు చంద్రబాబు చేసేందేమీ లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు రాగానే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలను రాయలసీమ ప్రజలు ఇక నమ్మరని, ఇక్కడి పౌరులకు పౌరుషం, ఆత్మాభిమానం ఎక్కువ అని బుగ్గన చెప్పారు. నంద్యాల ప్రజలు చంద్రబాబుకు కచ్చితంగా బుద్ధి చెబుతారని, ఎవరు ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మాత్రం తలొగ్గరని స్పష్టం చేశారు. మూడేళ్లలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు సున్నా అని, కానీ పార్టీ ఫిరాయించిన నలుగురైదుగురికి, ఆయన కుమారుడికి మాత్రం ఉద్యోగాలిచ్చారని ధ్వజమెత్తారు. ఎంపీ ఎస్పీవై రెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకొని డిస్టిలరీని కేటాయించారని అన్నారు. మరోపక్క, అంజాద్‌ భాషా మాట్లాడుతూ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిదేనని అన్నారు. రిజర్వేషన్ల ద్వారా ముస్లిం యువకులు ఎన్నో ప్రయోజనాలు పొందారని చెప్పారు. ఇప్పుడు వైఎస్‌ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.