తోటపల్లి ప్రధాన కాలువకు లైనింగ్ ?

12 Mar, 2016 01:56 IST|Sakshi

* రూ. 300 కోట్లు అవసరం
* నిధుల మంజూరుకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం
* ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు  

విజయనగరం కంటోన్మెంట్ : ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన తోటపల్లిని ప్రారంభిద్దామన్న ధ్యాసే తప్ప ఇతర బాగోగులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోయినా కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏటా సాగునీటి రంగానికి కేటాయించే నిధులకు సంబంధించి తోటపల్లి ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసింది. ఏమేం అభివృద్ధి పనులు చేయొచ్చో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోరడంతో ఇరిగేషన్ అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు.

తోటపల్లి ప్రాజెక్ట్‌ను 1200 క్యూసెక్కుల నీటి సామర్థ్యంగా 2003లో డి జైన్ చేశారు. అయితే అప్పట్లో పూసపాటి రేగ, గుర్ల, గరివిడి, గజపతినగరం, తదితర అదనపు ఆయకట్టు ప్రతిపాదనలు లేవు. ఆ తర్వాత నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో ఈ అదనపు ప్రాంతాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అయితే అదనపు ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు పూర్తి స్థాయిలో జోరుగా అందాలంటే కాలువ ఆసాంతం లైనింగ్ చేయాల్సి ఉంది.

ప్రస్తుతం కాలువ అంతా మట్టి, తుప్పలు, పెద్ద రెల్లు గడ్డితో నిండి ఉంది. మొత్తం 118 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ పరిస్థితి అంతా ఇలాగే ఉంది. రాష్ట్ర  ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేని సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పనుల కోసం సుమారు రూ. 300 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలను  కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిశీలించే అవకాశం ఉంది. నిధులు మంజూరు చేస్తే ఈ ఏడాదే పనులు ప్రారంభించే అవకాశముంది.
 
లైనింగ్ ఎందుకంటే..?
కాలువలో పిచ్చిమొక్కలు, పూడికలు పేరుకుపోవడంతో శివారు ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. ఇలా కాకుండా వాటన్నింటినీ తొలగించి కాంక్రీట్‌తో లైనింగ్ చేస్తే సాగునీటి ప్రవాహం జోరందుకుని అంతటా ఒకేలా నీరందుతుంది. అలాగే లైనింగ్ చేయడం వల్ల కాలువ గట్లు కూడా బలంగా తయూరవుతుంది.
 
ఏప్రిల్ మొదటి వారంలో ప్రతిపాదనలు సమర్పిస్తాం  తోటపల్లి కాలువ లైనింగ్ ప్రతిపాదనలు ఏప్రిల్ మొదటి వారంలో పంపిస్తాం. ప్రస్తుతం ప్రతిపాదనల తయూరీపై దృష్టి సారించాం  
- డోల తిరుమల రావు, పర్యవేక్షక ఇంజినీరు, తోటపల్లి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా