జలాశయాల వద్ద ఇక విందు, వినోదాలు

10 Oct, 2018 04:08 IST|Sakshi

     పర్యాటకానికి ఆశించిన గుర్తింపు రాలేదు

     ఏపీటీసీహెచ్‌బీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ప్రకృతి వనరులు, సహజసిద్ధ అందాలున్నా పర్యాటకానికి ఆశించినస్థాయిలో గుర్తింపు రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీ ఈవెంట్లు నిర్వహించడంతో సరిపెట్టుకోవద్దని, ఏడాది పొడవునా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించినపుడే ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం ఏపీ టూరిజం కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ బోర్డ్‌ (ఏపీటీసీహెచ్‌బీ) ఆరో సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళలో బ్యాక్‌ వాటర్‌ అంతా మురికిమయమని, ఇక్కడ కొల్లేరు, పులికాట్‌ వంటి సరస్సుల్లో స్వచ్ఛమైన నీళ్లుంటాయని తెలిపారు. అక్కడ హౌస్‌ బోటింగ్‌ ముఖ్య పరిశ్రమగా వర్ధిల్లుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా ఉందని, ఇక్కడా అలాంటి కృషి జరగాలన్నారు. ఇకపై జలాశయాలను విందు, వినోదాలకు కేంద్రాలు చేయాలని  నిర్ణయించారు.  

ఈవెంట్లే..ఈవెంటు: రాష్ట్రంలోని ముఖ్య జలాశయాలలో ప్రత్యేకంగా రూపొందించిన బోట్లు, షిప్‌లలో విందు వినోదాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత కృష్ణానదిలో, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. డిన్నర్‌ పార్టీలు, వేడుకలు నిర్వహించడానికి వీలుగా ప్రత్యేకంగా తయారుచేసిన క్రూయిజ్‌ బోట్లు, షిప్‌లను ప్రవేశపెడతామన్నారు. ఈ సంవత్సరంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుపతలపెట్టిన 18 ఈవెంట్ల క్యాలెండర్‌ను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. విశాఖలో డిసెంబర్‌ 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవ్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘ద ట్రైన్‌ స్టోరీ వైజాగ్‌’ ఈవెంట్, 2019 జనవరి 18, 19, 20 తేదీల్లో అరకు బెలూన్‌ ఫెస్టివల్‌ జరుపనున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది డిసెంబర్‌ 22, 23 తేదీలలో అమరావతి గ్లోబల్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్,  విజయవాడలోనే ఈ డిసెంబర్‌ 6 నుంచి నాలుగు రోజుల పాటు అమరావతి రెగట్టా పేరుతో పడవ పందేలు, జనవరి 12, 13 తేదీల్లో ‘గ్లోబల్‌ శాంతి’ పేరుతో బుద్ధిస్ట్‌ ఫెస్టివల్‌ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ 21, 22 తేదీల్లో ‘అమరావతి అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌’, తిరుపతిలో ఈ నెల 25 నుంచి నాలుగు రోజుల పాటు ఏపీ క్రాఫ్టŠస్‌ మేళా, విజయవాడలో నవంబరు 9, 10 తేదీల్లో సోషల్‌ మీడియా సమ్మిట్‌ అండ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. తిరుపతిలో జనవరి 11, 12, 13 తేదీల్లో వరల్డ్‌ స్పిరŠుచ్యవల్‌ ఫెస్ట్, కర్నూలులో నవంబర్‌ 29, 30 తేదీల్లో పౌరాణిక నాటకోత్సవం, సూర్యలంక, చీరాల, కొత్తపట్నంలో బీచ్‌ ఒలింపియాడ్, నవంబరు 10 నుంచి 18 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైడ్‌ ఏపీ పేరుతో మరో ఈవెంట్‌ జరుపనున్నట్లు తెలిపారు. కాకినాడలో డిసెంబర్‌ 22, 23 తేదీల్లో ఎన్టీఆర్‌ బీచ్‌ ఫెస్టివల్, జనవరి 15న కొవ్వూరులో హార్వెస్ట్‌ ఫెస్టివల్‌ జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

>
మరిన్ని వార్తలు