27 నుంచి పర్యాటక ఉత్సవాలు

24 Sep, 2014 03:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ : పర్యాటక దినోత్సవం సందర్భంగా 27 నుంచి 30వ తేదీ  వరకు నగరంలోని హరిత బెర్మ్ పార్కులో నిర్వహించనున్న పర్యాటక ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని శిల్పారామం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి జీఎన్ రావు తెలిపారు. మంగళవారం స్థానిక 27 నుంచి పర్యాటక ఉత్సవాలు బెర్మ్ పార్కులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ ఉత్సవాలను రాష్ట్రం విడిపోవడంతో నూతన రాజధాని విజయవాడలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అమరేంద్ర మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది ప్రత్యేకంగా కృష్ణహారతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

అదే కాకుండా  దాండియా డాన్స్, సాంస్కృతిక  కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 27వ తేదీ  ఉదయం జలక్రీడలు, బోట్‌రేస్ నిర్వహిస్తామని, సాయంత్రం ముఖ్యమంత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. 28వ తేదీ షాపింగ్ ఫెస్టివల్, పెయింటింగ్ పోటీలు దాండియా డాన్స్ ఉంటుందన్నారు. 29వ తేదీ వంటలు పోటీలు, పిల్లలు పెద్దలతో దసరా మేళా నిర్వహిస్తామన్నారు. భారతీయ ఆచార సంప్రదాయ దుస్తుల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని, 30వ తేదీ అవార్డుల  బహూకరణ, స్త్రీలకు మెహంది అలంకరణ, పెయింటింగ్ పోటీలు, ఫోటోగ్రఫీ పోటీలు ఉంటాయన్నారు. కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ మురళీ, సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి, హోటల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్టాబి, పారిశ్రామిక వేత్త ఎం.రాజయ్య  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు