విషవాయువులు ఊపిరి తీశాయి

17 Feb, 2018 02:13 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన సంపు

      సంపులోకి దిగి ఏడుగురు బలి

     ముగ్గురికి తీవ్ర అస్వస్థత

     చిత్తూరు జిల్లా మొరంలో వేంకటేశ్వర హేచరీలో ఘటన

పలమనేరు: సంపు శుభ్రం చేయడానికి దిగిన కార్మికులను విషవాయువులు మింగేశాయి.  ఏడుగురు మృత్యువొడిలోకి చేరారు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలోని వేంకటేశ్వర హేచరీలో శుక్రవారం జరిగింది. 

అసలేం జరిగిందంటే.. 
మొరంలోని వేంకటేశ్వర హేచరీలో దాదాపు 150 మంది పనిచేస్తారు. అందులో పరికరా లను శుభ్రం చేయడానికి, బ్యాక్టీరియాను నిర్మూలించడానికి హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ను వాడతారు. తర్వాత వ్యర్థాలను పైపుల ద్వారా 15 అడుగుల లోతైన సంపులోకి పంపుతారు. సంపులో నీటిని వారానికోసారి బకెట్లతో తోడేవారు. కానీ ఈ మధ్య సంపు శుభ్రం చేయక ఎక్కువ రోజులు కావడంతో అందులో కార్బన్‌మోనాక్సైడ్‌ భారీగా చేరింది. శుక్రవారం హేచరీకి వెళ్లగానే సూపర్‌వైజర్‌ శివకుమార్‌రెడ్డి అక్కడి సంపును శుభ్రం చేయాలని కార్మికులకు సూచించారు. దీంతో రెడ్డెప్ప, కేశవులు నిచ్చెనతో లోనికి దిగారు. వారు ఎంతకీ పైకి రాకపోవడంతో మిగిలినవారు ఒకరొకరిగా సంపులోకి దిగి పైకి రాలేదు. స్థానికులు వీరందరినీ పలమనేరు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఏడుగురు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 
మృతుల కుటుంబాలకు వెంటనే రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి
ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ప్రకాశం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ నాయకుల ద్వారా వివరాలు తెలుసుకుని బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు