బొమ్మా నిద్ర లేవమ్మా!

23 Nov, 2018 12:54 IST|Sakshi
తెరవెనుక కావ్యాలాపన చేస్తున్న కళాకారులు

పూర్వ వైభవం కోల్పోయిన తోలుబొమ్మలాట

అక్కడక్కడా కనిపిస్తున్న కళాకారులు

ప్రభుత్వ సాయం అందక అంతరించిపోయే ప్రమాదం

ప్రకాశం , కొనకనమిట్ల: ‘తోలుబొమ్మలాట చూడరో’ అంటూ సోగ్గాడు చేసే హంగామ ప్రజలను కడుపుబ్బ నవ్విస్తుంది. పూర్వం రోజుల్లో పల్లె ప్రాంతాల్లో తోలుబొమ్మలాట, బుడుగు జంఘాల హరికథలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రజలకు ఉత్సాహాన్ని నింపేయి. అప్పట్లో ఒక ఊపు ఊపిన తోలుబొమ్మలాట.. మూకీ చిత్రాలకు స్ఫూర్తినిచ్చే ప్రదర్శనలుగా భావించేవారు.  గ్రామస్థాయిలో విశేష ఆదరణ పొందిన ఆట తోలుబొమ్మలాటగా చెప్పుకోవచ్చు. పూర్వం జమిందార్‌లు కళాకారులకు గ్రామాలను మాన్యంగా ఇచ్చేవారంటే తోలుబొమ్మలాటకు ఉన్న ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో పల్లె భాషలను ఉచ్ఛరిస్తూ కళాకారులు పాటలు పాడేవారు.

తెరవెనుక ఉండి ఆహో, ఓహో అంటూ బొమ్మలను ఆడిస్తూ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చేవారు. మగవారు పాడుతుంటే మహిళలు అనుబంధంగా పాడుతూ వారితో గొంతు కలిపేవారు. తోలుబొమ్మలాటలో ముఖ్యంగా ఆహుతులను నవ్వించే సోగ్గాడు పాత్ర మరింత కవ్వింతగా ఉంటుంది. సోగ్గాడు వేసే కామెడీ సన్నివేశాలు అప్పట్లో ప్రజలు పడిపడి నవ్వుకొనేవారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే నాటకం సన్నివేశాలను సోగ్గాడు తెరవెనుక నుండి క్లుప్తంగా వివరించేవాడు. నాటకంలోని పాత్రధారుల సన్ని వేశాలను తెరవెనుక ఉండి కళాకారులు బొమ్మలతో ఆడిస్తూ ఆటను కొనసాగించేవారు. కానీ ఇదంతా గతంగా మారిపోయింది. ప్రస్తుతం అక్కడక్కడా ఈ కళాకారులు కనిపిస్తూ కళను సజీవంగా నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోవడంతో అందమైన తోలుబొమ్మలు ఇక కనిపించకుండా పోయే ప్రమాదం నెలకొంది.

మారిన కాలం
ఒకప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలను విశేషంగా ఆకట్టుకునే ఈ కళ ఇప్పుడు కళతప్పింది. ప్రస్తుతం కంప్యూటర్‌ యుగంతో పాతకాలపు ఆట, పాటలకు కళతప్పింది. సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల అభిరుచుల్లో వచ్చిన మార్పు ఆ కళ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందనే అనుకోవాలి. సినిమా వచ్చిన తరువాత ప్రాచీన కళలు కొన్ని కనుమరుగై కళాకారుల కడుపుకొట్టింది. కళలను నమ్ముకొని జీవించే కళాకారులు ప్రత్యామ్నాయ వృత్తులలోకి వెళ్లిపోయి జీవిస్తున్నారు. అయితే వారసత్వంగా వచ్చిన వృత్తిని వదులుకోలేక రంగం ఏదైనా కొంతమంది అదే వృత్తిని కొనసాగిస్తూ బతుకు బండిని లాగుతున్నారు.

తోలుబ్మొలాట ప్రదర్శనలో సుమారు 15 మంది కళాకారులు ఉండేవారు. బొమ్మలాట కావ్య ఆలాపన, గ్రంథ వచనం, భావ వ్యక్తీకరణ, శృతి, లయ, మృదంగ కళాకారులతో పాటు హంగుదార్లు ఈ కళకు అవసరం.

ప్రస్తుతం రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, సంస్థానాలు విలీనమయ్యాయి. వారితో పాటు ఈ కళ దాదాపు కనుమరుగైంది.. పూర్వం ఒక వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట కనుమరుగు కాకుండా కళాకారులు బతకాలంటే, కళలలకు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వాలు ప్రాచీన కళలను ప్రోత్సహించటంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు చేయూత నివ్వాలి. అప్పుడే ఇలాంటి కళాకారులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.

కళలను ప్రోత్సహించాలి,
తోలుబొమ్మలాట కళాకారుడు ఇటీవల కొనకనమిట్ల మండలంలో ప్రభుత్వ కార్యక్రమాలపై అక్కడక్కడ తోలుబొమ్మలాట ద్వారా ప్రదర్శనలు ఇచ్చాడు. జిల్లాలోని బల్లికురవకు చెందిన వనపర్తి అంకారావు, మంగమ్మ దంపతులు వారి పిల్లలతో ఈ కళను ప్రదర్శిస్తూ ‘సాక్షి’తో తోలుబొమ్మలాట విశిష్టతను వివరించారు. ‘ మా పూర్వికులు పూర్వం నుంచి ఇదే కళను నమ్ముకొనే జీవించేవారు. ఇప్పటికి నేను నా  భార్య మంగమ్మతో కలిసి కళను ప్రదర్శిస్తూ నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాన్నారు. పూర్వం కళను అవసోపన పట్టిందేకు ఎన్నో పాట్లు పడ్డాము. గత కొన్నేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రదర్శనలు ఇచ్చాం.  ప్రదర్శనలుకు మెచ్చిన పలువురు అవార్డులు, ప్రశంస పత్రాలు ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్న ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లభించలేదు. రుణాలు కానీ, కళాకారుల పింఛన్‌ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మాలాంటి కళాకారులు చాలామంది ప్రత్యామ్నాయంగా హరి కథలు, బుర్ర కథలు, చెక్క భజన, కోలాటం వైపు వెళ్లారు. మరికొంతమంది పౌరాణిక నాటకాలు ఆడుతున్నారు.అంకారావు, తోలుబొమ్మలాట కళాకారుడు

మరిన్ని వార్తలు