సమ్మెతో ప్రభుత్వాలకు దిమ్మతిరగాలి

26 Aug, 2015 04:21 IST|Sakshi
సమ్మెతో ప్రభుత్వాలకు దిమ్మతిరగాలి

కడప అగ్రికల్చర్ : సమ్మెతో ప్రభుత్వాలకు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలని కార్మిక సంఘాల నేతలు పిలుపు నిచ్చారు. మంగళవారం కడప నగరంలోని ఇందిరాభవన్‌లో కార్మిక సంఘ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు, ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధనలక్ష్మీ, హరికృష్ణ, ఐఎన్‌టీయుసీ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ  కార్మిక చట్టాలను సవరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

కార్మికులు సాధించుకున్న చట్టాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. సంఘాలు ఏర్పాటు చేయనీయకుండా కార్మికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు అవసరమైన విధంగా సవరణలు చేయడం లేదన్నారు. సెప్టంబరు నెల 2వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరు పాల్గొనాలని విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు. 1923లో కార్మిక చట్టం, 1926లో ట్రేడ్ యూనియన్ చట్టం, 1948లో వేతనాల చెల్లింపుల చట్టం, 1952లో భవిష్యనిధి చట్టం తీసుకువచ్చినా ఆ చట్టాలన్నీ 60, 70 ఏళ్లనాటివేనని తెలిపారు.వీటన్నింటిని సమయానుకూలంగా కంపెనీలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారేగాని కార్మికులకు ఉపయోగపడడం లేదన్నారు.  చట్ట సవరణ ముసుగులో హక్కులు కాలరాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

కార్మిక సంక్షేమానికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. కార్మిక చట్ట సవరణలో కనీస వేతనాలు రూ. 15000లు చేయాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్‌తో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలోకి వెళ్లాలని కోరారు. సదస్సులో ఐఎన్‌టీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకొమ్మదిన్నె సుబ్బరాయుడు, నగర అధ్యక్షుడు వెంకటరామరాజు, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామ్మోహన్, వైఎస్సార్‌టీయుసీ అధ్యక్షుడు అందె సుబ్బరాయుడు, బీఎంఎస్ జోనల్ కార్యదర్శి రమణ,హెచ్‌ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సుబ్బిరెడ్డి, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్  పాల్గొని మాట్లాడారు.

మరిన్ని వార్తలు