వినోదం.. విజ్ఞానం.. విలువైన పాఠం

7 Oct, 2019 11:26 IST|Sakshi

సాక్షి, బేస్తవారిపేట : పురాణేతిహాసాలు.. పర్యావకరణ పరిరక్షణ.. వివిధ రాష్ట్రాల ఆచారాలు.. వేషభాషలు.. పండుగుల ప్రాధాన్యత.. ఇలా సమస్త విషయాలను ఒక గదిలో కళ్లకు కట్టినట్లు చూపే ఘట్టాలు బొమ్మల కొలువులో మాత్రమే ఆవిష్కృతమవుతాయి. దసరా పండుగ వైశిష్ట్యాన్ని ఘనంగా చాటే ఈ వేడుకను జిల్లాలోని పలు చోట్ల భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. విజ్ఞాన వినోదాలను సమపాళ్లలో అందించే బొమ్మల కొలువు సంప్రదాయాన్ని నియమనిష్టలతో పాటిస్తున్న వారందరూ ఇప్పటి తరం వారికి మన సంస్కృతిని మరచిపోకుండా కాపాడుకుంటూ రెండు తరాల వారధిగా నిలుస్తున్నారు. 

కొలువు.. సులువు కాదు
ఒకప్పుడు దసరా వస్తోందంటే ఇంటింటా అందమైన బొమ్మలు కొలువుదీరేవి. వినోదంతోపాటు విజ్ఞానాన్ని పంచేవి. బొమ్మల కొలువును తీర్చిదిద్దడం అంత సులువైన పని కాదనేది అందరూ ఒప్పుకునే సత్యం. ఎక్కువ మొత్తంలో కొనుక్కోవడం, వాటిని జాగ్రత్తగా పదిలపరచడం అవసరం. భవిష్యత్తు తరాల వారికి పాత సంప్రదాయాలను అందించాలన్న ఉద్దేశంతో పాతతరం వారు బొమ్మల కొలువును ఇప్పటికీ అందంగా అందిస్తున్నారు. కొన్ని చోట్ల దసరా పండుగను కలిసికట్టుగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తూ మళ్లీ పాత వైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

బొమ్మల కొలువు సంప్రదాయం 
అనాదిగా వస్తున్న బొమ్మల కొలువు సంప్రదాయం వెనుక అనేక కారణాలున్నాయి. పూర్వం లలితకళల్లో ప్రధానమైన శిల్పకళను ప్రోత్సహించడానికి, జీవకళతో ఉట్టిపడే కళారూపాలను తయారు చేసే కళాకారులను బతికించడానికి అందరి చేత బొమ్మలు కొనిపించేవారు. సినిమాలు, టీవీలు లేని రోజుల్లో బొమ్మల కొలువు ద్వారా పురాణాల్లోని కథలను, విజ్ఞాన విషయాలను చిన్నారులను దగ్గర కూర్చోబెట్టుకుని పదిరోజులపాటు వీలు దొరికినప్పుడల్లా తెలియజేసేవారు. ఇవన్నీ ఇలా ఉంటే ముత్తయిదువులు, చిన్నారులకు బొమ్మలకొలువు ముందు నిత్యం తాంబూలాలు ఇవ్వాలనే సంప్రదాయం కూడా బాంధవ్యాలను మరింత దగ్గర చేసేది. కాలక్రమంలో బొమ్మల కొలువులు పెట్టే వారు తగ్గిపోయారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా