నేడు ట్రాఫిక్ మళ్లింపు

2 Jun, 2015 03:56 IST|Sakshi

ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
 
 గుంటూరు క్రైం : విజయవాడ బెంజ్ సర్కిల్‌లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం తెలిపారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడవైపు వెళ్లే భారీ వాహనాలు, లారీలను ఇతర మార్గాలకు మళ్లిస్తూ చర్యలు చేపట్టామన్నారు. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం నవనిర్మాణ దీక్ష పూర్తయ్యే వరకు రాకపోకలకు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామన్నారు.

చెన్నై నుంచి కలకత్తా వైపు వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లాలోని త్రోవకుంట, చదలవాడ, నాగులుప్పలపాడు, చినగంజాం, చీరాల, ఈపూరుపాలెం, బాపట్ల, కర్లపాలెం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా కృష్ణాజిల్లా చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ చేరుకుని జాతీయ రహదారి 16 మీదుగా కలకత్తా వైపు వెళ్లాలని చెప్పారు. కలకత్తా నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కూడా ఇదే మార్గంలో మళ్లిస్తామని చెప్పారు.

చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళ, దాచేపల్లి, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటాయని చెప్పారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గం వైపు మళ్లిస్తున్నామన్నారు. గుంటూరు నుంచి కలకత్తా వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు, నారాకోడూరు, బాపట్ల, కర్లపాలెం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జి, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ చేరుకుని కలకత్తా వైపునకు వెళ్లాలని సూచించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, దాచేపల్లి, మిర్యాలగూడ వైపుగా హైదరాబాద్ వెళ్లాలని వివరించారు. ట్రాఫిక్ మళ్లింపు కారణంగా వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు