ఇలా రండి.. అలా వెళ్లండి..!

2 Oct, 2018 13:39 IST|Sakshi

దసరా ఉత్సవాల నేపథ్యంలో        10 నుంచి ట్రాఫిక్‌ మళ్లింపు

పార్కింగ్‌ ప్రదేశాలు పది

ప్రత్యేకంగా పార్కింగ్‌ యాప్‌

ప్రణాళిక సిద్ధం చేసిన పోలీసులు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. మరో పది రోజుల్లో  బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, భవానీలు ఈ సందర్భంగా నగరానికి తరలి వస్తారు. జగ్గజ్జననిని దర్శించుకునేందుకు లక్షలాదిగా బారులు తీరుతారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేయగా.. నగర పోలీసు కమిషనర్‌తో చర్చించి తుది నిర్ణయం         తీసుకోనున్నారు.

సాక్షి, అమరావతిబ్యూరో : ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవ్వరూ ట్రాఫిక్‌ ఇక్కట్లను ఎదుర్కొనకుండా విజయవాడ్‌ పోలీసులు ప్రత్యేక ‘ట్రాఫిక్‌ యాప్‌’ను రూపొందించారు. ఈ యాప్‌ను ఉపయోగించుకుని భక్తులు సమీప పార్కింగ్‌ కేంద్రాలకు చేరుకోవచ్చు. అలాగే ఉత్సవాల నేపథ్యంలో నగరంలోకి గడ్డిలారీలు, ఊకలారీలకు అనుమతులు నిషేధించనున్నారు. వినాయక గుడి, కుమ్మరిపాలెం వరకుమాత్రమే భక్తుల వాహనాలను అనుమతిస్తారు. ఇక అక్కడి నుంచి 750 మీటర్ల ఘాట్‌ రోడ్డులో దుర్గగుడికి భక్తులు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వృద్ధులకు మాత్రం లిఫ్ట్‌ సౌకర్యం ఉంటుంది. అలాగే వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి వరకు అనుమతి ఉన్న వాహనాలు తప్ప ఏ విధమైన వాహనాల రాకపోకలకు అనుమతి ఉండబోదు. ఇక వీఐపీలందరికీ పున్నమి గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాట్లు చేశారు.

మొదటి మూడు రోజులు ఇలా..
దుర్గమ్మ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఈసారి వినూత్న రీతిలో ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఈ ఏడాది డైనమిక్‌ వెహికల్‌ ట్రాఫిక్‌ పద్ధతిన ఏర్పాట్లు చేయనున్నారు. బ్రహ్మోత్సవాలు మొదలైన మొదటి మూడు రోజులు హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు, అలాగే హైదరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను కాళేశ్వరరావు మార్కెట్‌ మీదుగానే వెళ్లవచ్చు. అంటే పీఎన్‌బీఎస్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలన్నీ కాళేశ్వరరావు మార్కెట్, చిట్టినగర్, టన్నెల్, గొల్లపూడి మీదుగా వెళ్లవచ్చు. ఇక హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి, సితార జంక్షన్, సీవీఆర్‌ ఫ్లై ఓవర్, పాల ఫ్యాక్టరీ, వెస్ట్‌ గేట్, కాళేశ్వరరావు మార్కెట్‌ బస్టాండ్‌ మీదుగా పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌కు మళ్లిస్తారు.

రద్దీ రోజుల్లో ఇలా..
సెలవు రోజులతోపాటు మూల నక్షత్రం, విజయదశమి రోజుల్లో మాత్రం మార్పులు ఉండబోతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో డైనమిక్‌ వెహికల్‌ ట్రాఫిక్‌ పద్ధతిలో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. హైదరాబాద్‌ నుంచి నగరానికి వచ్చే ఆర్టీసీ బస్సులను గొల్లపూడి, సితార జంక్షన్, కబేళా, సీవీఆర్‌ ఫ్లై ఓవర్, వైవీరావు ఎస్టేట్, ఆంధ్రప్రభ కాలనీ, ఏఎస్‌ నగర్‌ ఫ్లై ఓవర్‌ మీదుగా పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లోకి మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు కూడా ఇదే మార్గాల గుండా వెళ్తాయి.

హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు..
హైదరాబాద్‌ వైపు నుంచి చెన్నై, మచిలీపట్నం, ఏలూరు వైపు వెళ్లే ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను గొల్లపూడి నుంచి బైపాస్‌రోడ్డు మీదుగా సితార జంక్షన్, కబేళా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, ఎర్రకట్ట, సీతన్న పేట, బీఆర్‌టీఎస్‌ రోడ్డు, పడవలరేవు మీదుగా రామవరప్పాడు రింగ్‌కు వచ్చి 16వ నంబరు జాతీయ రహదారిలో కలుస్తాయి.

హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు..
చెన్నై, ఏలూరు, మచిలీపట్నంల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, చిన్న కార్లు 16వ నంబరు జాతీయ రహదారిపై బందరులాకుల వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి పోలీసు కంట్రోలు మీదుగా అండర్‌బ్రిడ్జి, గద్దబొమ్మ, కాళేశ్వరరావు మార్కెట్, చిట్టినగర్, సొరంగం, సితార సెంటర్‌ మీదుగా గొల్లపూడి వైపు మళ్లిస్తారు.

హైదరాబాద్‌ నుంచి వచ్చే రవాణా వాహనాలు..
హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్లే భారీ వాహనాలను(లాంగ్‌ ఛాసిస్, కంటైనర్లు) ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం, నూజివీడు మీదుగా హనుమాన్‌ జంక్షన్‌ వద్ద 16వ నంబరు జాతీయరహదారికి మళ్లిస్తారు. అదేవిధంగా హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలను నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, దాచేపల్లి, చిలకలూరిపేట మీదుగా 16వ నంబరు జాతీయ రహదారికి మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం రింగ్‌ నుంచి మైలవరం, చంద్రాల, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్, గన్నవరం మీదుగా మళ్లిస్తారు.

హైదరాబాద్‌ వైపు వెళ్లే రవాణా వాహనాలు..
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలు వారిధి నుంచి గన్నవరం, హనుమాన్‌ జంక్షన్, నూజివీడు, మైలవరం మీదుగా ఇబ్రహీంపట్నం వద్ద 65వ నంబరు జాతీయ రహదారికి మళ్లిస్తారు. గుంటూరు నుంచి వెళ్లే భారీ వాహనాలను చిలకలూరిపేట, దాచేపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా 65వ నంబరు జాతీయ రహదారికి మళ్లిస్తారు.

పార్కింగ్‌ ప్రదేశాలు..
పున్నమి గెస్ట్‌హౌస్‌ పార్కింగ్‌ ప్రదేశం.. కుమ్మరిపాలెం వద్ద టీటీడీ చెందిన ఖాళీ స్థలం.. రాజీవ్‌గాంధీ పార్కు, పూలమార్కెట్, కాళేశ్వరరావు మార్కెట్‌లోని పెయిడ్‌ పార్కింగ్, గాంధీజీ మహిళా కళాశాల, తారాపేట రైల్వే స్టేషన్‌ ఆవరణ, పంజాసెంటర్‌లోని కృష్ణవేణి హోల్‌సేల్‌ మార్కెట్, ఓల్డ్‌ పోలీసు క్వార్టర్స్‌   ప్రాంతాల్లో  పార్కింగ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు