30 నిమిషాలునరకమే!

16 Oct, 2019 13:17 IST|Sakshi
సీహార్స్‌ కూడలి వద్ద నిలిచిపోయిన ట్రాఫిక్‌

సీహార్స్‌ కూడలి వద్ద గరీభ్‌రథ్‌

ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేతతో ఇక్కట్లు

ఈ మార్గంలో ప్రభుత్వకార్యాలయాలకు వెళ్లే  ఉద్యోగుల అవస్థలు

మండుటెండలో పడిగాపులు

సమస్య పట్టించుకోని రైల్వే అధికారులు

పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): విశాఖపట్నం–హైదరాబాద్‌ గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ సీహార్స్‌ కూడలి వద్ద నిలిపివేయడంతో ఈ మార్గంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు 30 నిమిషాలు నరకం చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.... హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వచ్చే గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి రోజు ఉదయం 8.30– 9 గంటల మధ్య విశాఖ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం చేస్తుంది. ఈ మధ్య కాలంలో దీన్ని శుభ్రం చేసేందుకు లోకోషెడ్‌కు తరలిస్తారు. అయితే ఉదయం 8.30 గంటల సమయంలో విశాఖపట్నానికి వచ్చే రైళ్ల సంఖ్య అధికంగా ఉండడంతో విశాఖకు చేరుకున్న గరీబ్‌ రథ్‌ను వెంటనే లోకోషెడ్‌కు తరలింపునకు కుదరదు. దీంతో గరీబ్‌ రథ్‌ను చావులమదుం మీదుగా పోర్టుకు వెళ్లే రైల్వే ట్రాక్‌మీద సీహార్స్‌ కూడలి వరకూ రైల్వే అధికారులు పంపుతున్నారు. 

సమస్య మొదలయ్యేది ఇక్కడే..
ఉదయం 9.30 గంటల సమయంలో గరీబ్‌ రథ్‌ను ప్రతి రోజు పంపుతుండడంతో ఆ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీహార్స్‌ కూడలి నుంచి పోర్టుట్రస్ట్, జీఎస్టీ, సెంట్రల్‌ ఎక్సైజ్, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ వంటి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పోర్టు ఆవరణలో ఉన్న పలు ప్రైవేటు కార్యాలయాలకు ఉద్యోగులు వెళ్లాల్సింది ఉంటుంది. హడావుడిగా ఉద్యోగులు సీహార్స్‌ కూడలి నుంచి పోర్టులోకి వెళ్లే మలుపు తిరగ్గానే ఎదురుగా గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ కనిపించడంతో దాదాపు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకూ మండుటెండలో పడిగాపులు పడాల్సి వస్తోంది. ఆఫీసులకు వెళ్లే సమయంలో అడ్డంగా రైలు ఉండడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బయోమెట్రిక్‌ భయం..
దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ ప్రవేశపెట్టడంతో ఆలస్యంగా కార్యాలయానికి చేరుకుంటే ముప్పు తప్పదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలకు ముందుగా బయలుదేరినా మార్గమధ్యలో గరీబ్‌రథ్‌ సృష్టిస్తున్న ఆలస్యానికి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

మరో మార్గంలో ప్రయాణం..
సీహార్స్‌ కూడలి వద్ద రైలు నిలిచిన సమయంలో కార్యాలయాలకు వెళ్లే వారు తమ కార్యాలయాలను చేరుకోవాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గం ఉన్నా సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాలి. సీహార్స్‌ కూడలి నుంచి కాన్వెంట్‌ కూడలికి వచ్చి అక్కడి నుంచి పోర్టు అంతర్గత మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో నిరంతరం కంటైన్లరకు మోసుకుంటూ భారీ వాహనాలు నిరంతరం తిరుగుతుంటాయి. ప్రమాదకరమైన ఈ మార్గాన్ని అత్యవసర సమయాల్లో తప్ప వినియోగించేందుకు సాహసించారు.  

సకాలంలో చేరకుంటే ఇబ్బంది
గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ను సీహార్స్‌ కూడలి వరకూ తీసుకువచ్చి అక్కడ నిలిపి ఉంచడం వల్ల ఉద్యోగులు నరకం చూస్తున్నారు. సమ యానికి కార్యాలయాలకు వెళ్లకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. రైల్వే అధికారులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి         – ఎం.ఎస్‌.ఎన్‌.పాత్రుడు, విశ్రాంత పోర్టు ఉద్యోగి

మరిన్ని వార్తలు