సెల్లార్లపై సమరం

1 Dec, 2018 07:35 IST|Sakshi
వన్‌టౌన్‌లో సెల్లార్‌ను పరిశీలిస్తున్న జీవీఎంసీ, ట్రాఫిక్‌ బృందం

పార్కింగ్‌ సమస్యను తీర్చేందుకు ఉక్కుపాదం

జీవీఎంసీ, ట్రాఫిక్‌ సిబ్బంది సంయుక్త దాడులు

ఉల్లంఘనులకు హెచ్చరికలు

నోటీసులు సిద్ధం చేస్తున్న జీవీఎంసీ

అందాల నగరిగా.. ఆర్థిక రాజధానిగా.. స్మార్ట్‌ సిటీగా విస్తరిస్తున్న విశాఖ నగరంపైనే అందరి చూపు. నగరం విస్తరిస్తున్నట్లుగానే.. జనాభా, వారు వినియోగిస్తున్న వాహనాలూ పెరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారింది. విశాలంగా ఉన్న విశాఖ రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్య ఉండేది కాదు.. కానీ గడిచిన మూడేళ్లలో బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. బహుళ అంతస్తుల్లో పార్కింగ్‌ సదుపాయం సరిగ్గా కల్పించక రోడ్డుపైనే వాహనాలను పార్క్‌ చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

విశాఖ సిటీ: మహా విశాఖ నగరంలో పార్కింగ్‌ సమస్య జఠిలమైపోతోంది. ఓ వైపు బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు పెరిగిపోతుండగా.. వాటి సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ సౌకర్యానికి బదులు వ్యాపార లావాదేవీలకు ఉపయోగిస్తుండడంతో సమస్య రోజు రోజుకీ తీవ్రమవుతోంది. దీనిని అధిగమించడానికి జీవీఎంసీ, ట్రాఫిక్‌ పోలీసు విభాగం సంయుక్తంగా రంగంలోకి దిగాయి. సమస్య ఎక్కువగా ఉన్న వన్‌టౌన్‌ ఏరియాలో డ్రైవ్‌ చేపట్టి సెల్లార్లను పార్కింగ్‌ కోసం ఉపయోగించేలా చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలో దాదాపు 500కు పైగా బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలుండగా వీటిలో 50 భవనాల వరకూ మాత్రమే సెల్లార్లను పూర్తిగా పార్కింగ్‌కు ఉపయోగిస్తున్నాయి. మరో 50 దుకాణాలు తూతూ మంత్రంగా పార్కింగ్‌ కోసం సెల్లార్లను వినియోగిస్తుండగా.. మిగిలిన 400కి పైగా సముదాయాలు మాత్రం వాటిని కమర్షియల్‌గా వినియోగించుకుంటున్నాయి. జీవీఎంసీలో ప్లాన్‌ తీసుకునేటప్పుడు మాత్రం సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగిస్తామని పేర్కొంటారు. కానీ భవనం వినియోగంలోకి వచ్చాక దాన్ని వ్యాపార, వాణిజ్యానికి ఉపయోగించి, వాహనాలను రోడ్లపైనే పార్క్‌ చేస్తున్నారు.

జీవీఎంసీతో కలిసి ‘ట్రాఫిక్‌’ నియంత్రణ కోసం..
నగరంలో వాణిజ్య ప్రాంతాలైన జగదాంబ, డాబాగార్డెన్స్, పూర్ణామార్కెట్, ద్వారకానగర్, అశీల్‌మెట్ట, మద్దిలపాలెం, జిల్లా పరిషత్, కేజీహెచ్, గాజువాక, అక్కయ్యపాలెం, ఎంవీపీ కాలనీ, కంచరపాలెం, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, మర్రిపాలెం, సూర్యాబాగ్, మాధవధార తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ ఉన్న వాణిజ్య సముదాయాల్లో 90 శాతం వరకూ సెల్లార్లను పార్కింగ్‌కు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే రద్దీ ఎక్కువైపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు జీవీఎంసీతో కలిసి ట్రాఫిక్‌ పోలీసులు నడుంబిగించారు. రెండు శాఖలు సంయుక్తంగా పార్కింగ్‌ సమస్యకు సరైన పరిష్కారం కోసం సమన్వయంగా పనిచేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా డ్రైవ్‌ చేపట్టారు. తొలి విడతలో భాగంగా ప్రధాన రద్దీ ఉన్న వన్‌ టౌన్‌ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలకు తాఖీదులివ్వడం ప్రారంభించారు. శుక్రవారం జీవీఎంసీ, ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు వాల్తేర్‌ రోడ్డులో వాణిజ్య సముదాయాల్ని పరిశీలించారు. సెల్లార్లను పార్కింగ్‌కు ఉపయోగించకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భవన యజమానులకు హెచ్చరికలతో కూడిన నోటీసులు జారీ చేశారు. సెల్లార్లను పార్కింగ్‌కు మాత్రమే వినియోగించకపోతే భవనాల్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

ఫ్రీ పార్కింగ్‌ జోన్స్‌ ఎక్కడ?
నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్న జీవీఎంసీ.. పార్కింగ్‌ విషయంలో మాత్రం సరైన చర్యలు తీసుకోలేకపోతోందన్న విమర్శ ఉంది. చాలా నగరాల్లో ఫ్రీ పార్కింగ్‌ జోన్లు ఎక్కువగా ఉంటాయి. మహా విశాఖ నగరంలో మాత్రం అక్కడక్కడా ఇవి కనిపిస్తున్నాయి. రైతుబజార్లు, పూర్ణామార్కెట్, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్‌ ఫీజుల దందా కొనసాగుతోంది. అక్కడ ఐదు నిమిషాల పని ఉన్నా రూ.10 నుంచి రూ.40 వరకూ వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు చెల్లించేందుకు ఇష్టపడక వాహనదారులంతా ఎక్కడపడితే అక్కడ పార్క్‌ చేసేస్తున్నారు. ఈ కారణంగానే సమస్య పెరిగిపోతోంది. మరోవైపు నోపార్కింగ్‌ జోన్లలో వాహనాలు నిలపడం ట్రాఫిక్‌ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఫ్రీ పార్కింగ్‌ విషయంలో జీవీఎంసీ కాస్తా ప్రణాళికలు రూపొందించి. ప్రతి అర కిలోమీటర్‌ లేదా కిలోమీటర్‌ దూరంలో ఒక ఫ్రీ పార్కింగ్‌ జోన్‌ ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్కింగ్‌ కష్టాలు తీర్చేందుకే ప్రత్యేక డ్రైవ్‌
నగరంలో వ్యక్తిగత వాహన వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్కింగ్‌ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్మార్ట్‌ నగరంలో ప్రజలు పార్కింగ్‌ కోసం అవస్థలు పడకుండా ఉండేందుకు కమిషనర్, చీఫ్‌ సిటీ ప్లానర్‌ సూచనల మేరకు ట్రాఫిక్‌ పోలీసులతో కలిపి చర్యలకు ఉపక్రమిస్తున్నాం. అన్ని ప్రధాన రహదారుల్లోనూ డ్రైవ్‌ చేపడుతున్నాం. ప్రతి వాణిజ్య సముదాయంలోనూ సెల్లార్‌ను పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నాం.     –సురేష్, జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్‌

>
మరిన్ని వార్తలు