ఉల్లంఘనులు

3 Oct, 2018 13:47 IST|Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో :    పటమటకు చెందిన విశాల్‌ తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ 73 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించాడు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను బేఖాతరు చేసిన ప్రతిసారీ అతనికి ట్రాఫిక్‌ పోలీసులు ఈ–చలానాలు పంపుతానే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అపరాధ రుసుం చెల్లించలేదు.సత్యనారాయణపురంలో ఉండే సురేష్‌ 63 సార్లు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను పాటించకుండా కారు నడుపుతూ నిబంధనలను బేఖాతరు చేశాడు. పోలీసులు ఈ–చలానాలను పంపారు. కానీ ఒక్క సారీ అపరాధ రుసుం కట్టలేదు. 

ఇలాంటి విశాల్, సురేష్‌లు నగరంలో మరో పది వేల మందికి పైడి ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే అంటున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత నూతన రాజధానిలో భాగమైన బెజవాడలో  నాలుగేళ్లుగా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘనులపై కొరడా ఝళిపించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా వాహనాలను ఇష్టానుసారం నడుపుతున్న వాహనచోదకులను కట్టడి చేయనున్నారు. విజయదశమి తర్వాత స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం చేపట్టి అప్పటికీ దారికి రాని వాహనచోదకుల వాహనాలను సీజ్‌ చేయాలని ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు.  దసరా తర్వాత చిక్కులు తప్పవంటున్నారు ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు.

నాలుగేళ్లలో 23 లక్షల మందిపై కేసులు..
రాజధానిగాలో అంతర్భాగమయ్యాక బెజవాడలో 2014 నుంచి 2018 సెప్టెంబరు నెల వరకు 23,07,318 మంది వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధలను ఉల్లంఘించారు. దీంతో వీరందరిపై కేసులు నమోదు చేస్తూ ట్రాఫిక్‌ పోలీసులు ఈ–చలానాలను పంపుతూ వచ్చారు. ఇందులో 12,83,998 మంది స్పందించి ఈ–చలానాల్లో పేర్కొన్నట్లుగా దాదాపు రూ.20 కోట్లకుపైగా అపరాధ రుసుం చెల్లించారు. మిగిలిన 10,23,320 మంది వాహనచోదకుల నుంచి స్పందన లేకుండా పోయింది. వీరిలో 200 మందికిపైగా వాహనచోదకులు తరచూ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న ఘటనలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఒక్కొక్కరూ 10 నుంచి 70 సార్లుకుపైగా నిబంధల్ని ఉల్లంఘించడం గమనార్హం. మిగిలిన వారు మాత్రం ఎక్కువ సార్లు నిబంధనల్ని బేఖాతరు చేయకపోయినా అపరాధ రుసుం మాత్రం కట్టకుండా మిన్నకుండిపోయారు. వీరంతా కూడా దాదాపు రూ.20 కోట్ల వరకు ఫైన్‌ కట్టాల్సిఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

వారం రోజులు స్పెషల్‌ డ్రైవ్‌..
ఒకరికంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్నా.. అతివేగంగా వాహనాన్ని నడుపుతున్నా.. హెల్మెట్‌ లేకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నా.. ఇప్పటి వరకు చూసీచూడనట్లు వ్యవహరించిన ట్రాఫిక్‌ పోలీసులు ఇకపై కొరడా ఝళిపించనున్నారు. అయితే దసరా పండుగ వరకు వారందరికీ ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటిలోగా ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేసినా వాహనదారులు అపరాధ రుసుం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా చెల్లించని వాహనాలను సీజ్‌ చేస్తామని.. అవసరమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. విజయదశమి తర్వాత ఒక వారం రోజులపాటు నగరవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టబోతున్నారు. కాబట్టి ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనదారులు తస్మాత్‌ జాగ్రత్త. 

మరిన్ని వార్తలు