మిన్నంటిన విషాదం

9 Sep, 2015 03:46 IST|Sakshi
మిన్నంటిన విషాదం

తమలా కష్టపడ కూడదని అష్టకష్టాలు పడి బిడ్డలను చదివించారు. అందరి కళ్లావేళ్లాపడి ఓ పెద్ద పరిశ్రమలో ఉద్యోగంలో కుదిర్చారు. కడ దాక తమకు తోడుంటారనుకున్న కన్నవాళ్ల ఆశలను సమాధి చేస్తూ కన్నీటి శోకాన్ని మిగిల్చారు. మూడు కుటుంబాలను విధి వక్రీకరించి దుఃఖసాగంలో ముంచేసింది. తడ మండలం మాంబట్టు సెజ్‌లోని ఇండస్ కాఫీ పరిశ్రమలో మంగళవారం చోటు చేసుకున్న దుర్ఘటనతో మూడు మండలాల్లో విషాదం మిన్నంటింది. పరిశ్రమ పూర్తిస్థాయిలో ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్న దశలో తమకు ప్రాధాన్యం ఉంటుందని ఆశించే సమయంలో అకాల మృత్యువు కబళించింది.
 
 తడ/సూళ్లూరుపేట/దొరవారిసత్రం :  ఇండస్ కాఫీ పరిశ్రమలో మంగళవారం జరిగిన దుర్ఘటనలో మృత్యువు పాలైన ముగ్గురి కుటుంబాల పరిస్థితి వేర్వేరు. రెక్కలు ముక్కలు చేసి బిడ్డలను చదివించారు. చదివిన చదువుకు సరైన ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. తెలిసిన వాళ్లను పట్టుకుని చివరకు చదువుకు తగిన ఉద్యోగాలు కాకపోయినా ఇండస్ కాఫీ పరిశ్రమలో ఉద్యోగాల్లో చేరారు. పరిశ్రమ ప్రస్తుతం ట్రయల్న్ ్రచేస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో పరిశ్రమ రన్ అయ్యే అవకాశం ఉండటంతో అప్పడు తమకు మంచి ప్రాధాన్యత ఉంటుందని ఆశపడ్డారు. అంతలోనే ఆ ముగ్గురిని మృత్యువు కబళించింది.

తడ మండలం నామర్లమిట్టకండ్రికకు చెందిన చేని ఈశ్వర్, సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్యనగర్‌కు చెందిన నీరుపాక రవి, దొరవారిసత్రం మండలం కల్లూరుకు చెందిన చిట్టిబోయిన రవీంద్రబాబు ఏడాది క్రితం కాఫీ పరిశ్రమలో చేరారు. ఒకరికొకరు స్నేహభావంగా మెలుగుతున్నారు మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒకరిని కాపాడేందుకు మరొకరు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా  నిండు నూరేళ్లు జీవితాలను పణంగా పెట్టారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే కన్నవాళ్ల ఆశలను సమాధి చేశారు.  

 చెల్లెలికి పెళ్లి చేయాలని..
 నామర్లమిట్టకండ్రిగకు చెందిన చేని వెంకటేశ్వర్లు, వజ్రమ్మలకు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు. ఈశ్వర్ ఒక్కడే కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ ఎంఏ, బీఈడీ వరకు చదివించారు. ఈశ్వర్‌ను కష్టం తెలియకుండా పెంచి మంచి చదువు చదివించారు. ఉద్యోగం రాకపోవడంతో ఇంటికి దగ్గరలోనే ఉన్న కాఫీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కకు వివాహం కాగా చెల్లెలి పెళ్లి కోసం తండ్రికి తోడుగా తన సంపాదన కూడా ఉపయోగపడుతుందని చదువుకు తగిన ఉద్యోగం కాకపోయినా కంపెనీలో పనికి చేరాడు. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.  

  ఆధారంగా ఉండే బిడ్డ పోవడంతో..  
 తల్లిదండ్రుల పోషణ తనపై వేసుకుని అన్నీ తానై చూసుకునే బిడ్డ ఇక లేడనే విషయం తెలియడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించడం అందరి కలిచి వేసింది. కల్లూరుకు చెందిన చిట్టిబోయిన రత్నయ్య, సుగుణమ్మకు ముగ్గురు సంతానం. వీరిలో చివరి వాడైన రవీంద్రబాబు. అన్న చెంగయ్య పెళ్లయి వేరుగా ఉన్నాడు. అక్కకు వివాహమై వెళ్లిపోయింది. రవీంద్రబాబు తల్లిదండ్రులను పోషిస్తూ ఉన్నాడు. ఐటీఐ వరకు చదివిన రవీంద్రబాబు ఏడాది కింద వరకు చెన్నై ప్రాంతం గుమ్మిడిపూండిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడు. ఆ తర్వాత మాంబట్టులోని కాఫీ పొడి పరిశ్రమలో చేరాడు. మంగళవారం జరిగిన దుర్ఘటనలో రవీంద్రబాబు మృతి చెందడటంతో వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులు కడుపు శోకంతో తల్లడిల్లిపోయారు.
 
 పెళ్లి చేయాలని అనుకున్నామురా కొడుకా..
 వినాయక చవితి పండగ పోగానే పెళ్లి చేయాలనుకుంటే అంతకు ముందే వెళ్లిపోయావురా కొడుకా అంటూ సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్య నగర్‌కు చెందిన నీరుపాక రవి తల్లిదండ్రులు రాఘవయ్య, వెంకటమ్మలు ఆసుపత్రిలో ప్రాంగణంలో గుండెలవిసేలా రోదించడంతో పలువురిని కలిచివేసింది. బజారులో పూలు అమ్ముకుంటూ జీవించే వీరికి రవి చిన్నకుమారుడు. ఇతన్ని ఐటీఐ వరకు చదివించి ఉద్యోగంలో చేరాడు. పెళ్లి చేస్తామని వెంకటగిరి ప్రాంతంలో అమ్మాయిని కూడా చూశారు. అంతలోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన తమ కొడుకును అకాల మృత్యువు కాటికి పంపిందంటూ గుండెలు బాదుకున్నారు.

మరిన్ని వార్తలు