కామిరెడ్డి నాని ఇంట విషాదం

25 Feb, 2019 03:00 IST|Sakshi
ఆదిత్య (ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో చిన్నాన్న కుమారుడు ఆదిత్య దుర్మరణం

రాత్రంతా అన్నకు తోడుగా పోలీస్‌స్టేషన్‌లోనే గడిపిన మృతుడు

ఉదయం నానమ్మతో కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

చింతమనేని వల్లేనంటూ కుటుంబ సభ్యుల ఆవేదన

పెదవేగి రూరల్‌/దెందులూరు/సాక్షి, అమరావతి బ్యూరో: దళితులపై పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యాఖ్యలకు సంబంధించిన ఉదంతంలో ఓవరాక్షన్‌ చేసిన పోలీసుల వైఖరి కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. చింతమనేని ప్రసంగాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారన్న అక్కసుతో జిల్లాలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన నూతన వరుడు కామిరెడ్డి నానిని శనివారం పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేషన్‌లో ఉన్న అన్నకు తోడుగా చిన్నాన్న కుమారుడు కామిరెడ్డి ఆదిత్య (26) రాత్రంతా స్టేషన్‌ వద్దే నిద్రలేకుండా గడిపాడు. ఆదివారం ఉదయం ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. అంతకుముందు.. తెల్లవారుజామున నాలుగు గంటలకు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా నాని బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం ఇద్దరూ శ్రీరామవరం చేరుకున్నాడు.

ఆ తర్వాత ఆదిత్య, తన నానమ్మ దేవికారాణితో కలిసి తడికలపూడి గ్రామంలో జరుగుతున్న ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి కారులో బయల్దేరాడు. పెదవేగి మండలం వేగివాడ గ్రామం దాటిన తరువాత జంగారెడ్డిగూడెం వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఆదిత్య కారు ఢీకొట్టి తిరగబడింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కారులో ఉన్న ఆదిత్య, దేవికారాణిలను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, ఆదిత్య అక్కడికక్కడే మృతిచెందగా నానమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన ఆదిత్య ఏలూరులో ‘మిత్సుబిషి’ కంపెనీ డీలర్‌. ఇంకా వివాహం కాలేదు. చింతమనేని ప్రభాకర్‌వల్లే తమ కుటుంబం ఆదిత్యను కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పెళ్‌లై 24 గంటలు కూడా కాకుండానే కామిరెడ్డి నానిని పోలీసులు అరెస్టుచేయడం, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే కేసులో కూడా రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచడం వంటి పరిణామాలతో కుటుంబ సభ్యులందరూ ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే రాత్రంతా నిద్రలేక ఉదయం డ్రైవింగ్‌ చేస్తూ ఆదిత్య మృతిచెందడంతో శ్రీరామవరంలో విషాదఛాయలు అలముకున్నాయి.
 
నానికి వైద్యపరీక్షలు
ఇదిలా ఉంటే.. ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు నానీని పలు కారణాలతో స్టేషన్‌లోనే ఉంచడంతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ నాయకులు పి.సుధాకర్‌రెడ్డి, శరత్‌రెడ్డి, లక్ష్మీకుమార్, ధనుంజయలతో పాటు ఎమ్మెల్సీ ఆళ్ళ నాని, కోటగిరి శ్రీధర్, అబ్బయ్య చౌదరి నాని బెయిల్‌ విషయమై ఏలూరు డీఎస్పీతో మాట్లాడారు. దాంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో నానికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మేజిస్ట్రేట్‌ వద్ద హాజరుపర్చగా ఆయన బెయిల్‌ మంజూరు చేశారు.  

చింతమనేని క్షమాపణ
‘సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో నా వ్యాఖ్యలతో దళితులు బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నా’.. అని చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడ స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను అప్రతిష్ట పాల్జేయటానికే కొన్ని మీడియాల సంస్థలు ఆ వీడియోని ప్రసారం చేస్తున్నాయన్నారు. 

మరిన్ని వార్తలు