పండుగపూట విషాదం

11 Aug, 2013 04:41 IST|Sakshi

 పరిగి, న్యూస్‌లైన్: రంజాన్ పర్వదినం.. ఆ కుటుంబమంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొంది. పిల్లలు సహా తండ్రి ఈద్గాకు వెళ్లి నమాజు చేసి వచ్చారు. కానీ అంతలోనే విధి ఆ బాలుడిని కాటేసింది. గుంత రూపంలో మృత్యువు కబళించింది. అప్పటిదాకా ఆనందంగా ఉన్న ఆ కుటుంబం విషాదంలో మునిగింది. పరిగి మండలం సుల్తాన్‌పూర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం గుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు.. దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ జహంగీర్ లారీ డ్రైవర్. ఆయనకు ఆరో తరగతి చదువుతున్న సోను(11), కూతుళ్లు అఫ్రిన్ (15), తబసుం(14), సోని(9) సంతానం. ఇటీవల పరిగి మండలం సుల్తాన్‌పూర్ గేట్ సమీపంలో స్థలం కొనుగోలు చేసి అక్కడే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. పిల్లలను పరిగిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు.
 
  శుక్రవారం రంజాన్ పండుగ ఉండటంతో జహంగీర్ తన కుమారుడు సోనుతో కలిసి పరిగిలోని ఈద్గాకు వెళ్లి ప్రార్థనలు చేసి వచ్చారు. మధ్యాహ్నం తర్వాత సోను స్థానిక కుంట సమీపంలోని పొదల్లోకి బహిర్భూమికి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరికి రాకపోవటంతో కుమారుడి కోసం తల్లి వెతకసాగింది. కుంట ఒడ్డున సోను నీళ్లు తీసుకువె ళ్లిన డబ్బా, ఓ చెప్పు కనిపించింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. సమీప పొలాల రైతులు, గ్రామస్తులతో కలిసి కుంటలో వెతికారు. ఈక్రమంలో సాయంత్రం సోను మృతదేహం కుంటలో కనిపించింది. దీంతో జహంగీర్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుంట లోతు మామూలుగానే ఉన్నప్పటికీ అందులో జేసీబీలతో మట్టి తవ్వకాలు అక్రమంగా జరపటంతో దాదాపు 10 మీటర్ల మేర గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచాయి. ఆ గుంతలే బాలుడిని బలిగొన్నాయని గ్రామస్తులు చెప్పారు. సుల్తాన్‌పూర్ శివారులోనే మరో చోట జేసీబీ గుంతల్లోనూ గతంలో ఓ బాలుడు పడి మృతిచెందినట్లు గ్రామస్తులు చెప్పారు.

మరిన్ని వార్తలు