బెడ్‌పై నుంచి పడి బాలింత మృతి

29 Aug, 2018 03:38 IST|Sakshi

     విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో విషాదం

     పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గంటల వ్యవధిలోనే ఘటన

     ఇద్దరి బాలింతలకు ఒకే బెడ్‌ కేటాయింపు

     రాత్రంతా బాధను ఓర్చుకొని సర్దుకొని పడుకున్న బాలింత స్వాతి

     ఉదయానికల్లా కిందపడి కన్నుమూత

     సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆగ్రహం

లబ్బీపేట (విజయవాడ తూర్పు): పండంటి మగబిడ్డ పుట్టాడని ఆనందంలో ఉన్న ఓ కుటుంబాన్ని.. గంటల వ్యవధిలోనే విషాదం ముంచెత్తింది. ప్రభుత్వ, సిబ్బంది నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలను బలితీసుకుంది. పురిటినొప్పులను భరించి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెకు.. మరో బాలింతతో కలిపి ఓకే మంచం కేటాయించారు. రాత్రంతా పంటి బిగువున బాధను ఓర్చుకొని పడుకున్న ఆమె.. తెల్లారేసరికి మంచంపై నుంచి పడి స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మంగళవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. విజయవాడలోని కొత్తపేట శ్రీనివాస మహల్‌ సెంటర్‌కు చెందిన పి.స్వాతికి పురిటినొప్పులు రావడంతో సోమవారం మధ్యాహ్నం ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. రాత్రి 8.50 గంటల సమయంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఉమ్మ నీరు తాగాడని శిశువును ప్రత్యేక విభాగానికి తరలించిన సిబ్బంది.. స్వాతిని ప్రసూతి వార్డుకు పంపించారు. అక్కడ పడకలు ఖాళీ లేకపోవడంతో.. మరో బాలింత ఉన్న మంచాన్నే స్వాతికి కూడా కేటాయించారు. రాత్రంతా సర్దుకొని పడుకున్న స్వాతి.. మంగళవారం ఉదయం ఉన్నట్లుండి మంచంపై నుంచి కిందపడిపోయింది.

తీవ్ర బాధతో కొద్దిసేపు కాళ్లు, చేతులు కొట్టుకుంది. దీంతో సిబ్బంది ఆమెను లేబర్‌ వార్డుకు తరలించారు. చికిత్స అందిస్తుండగా స్వాతి మృతి చెందింది. ఈ సమాచారం తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌–2 బాబూరావు, అర్బన్‌ తహశీల్దారు అబ్దుల్‌ రెహ్మాన్‌ మస్తాన్‌లు ప్రభుత్వాస్పత్రికి చేరుకొని బాధితులు, వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు బాలింతలకు కలిపి ఒకే మంచం కేటాయించారని, దీని వల్లే స్వాతి కిందపడిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. తీవ్ర బాధతో అల్లాడిపోతున్నా కూడా సిబ్బంది పట్టించుకోలేదని బాధితురాలి మరిది నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము గట్టిగా నిలదీయడంతో చాలాసేపటి తర్వాత చికిత్స కోసమంటూ తీసుకెళ్లారని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి స్వాతి మృతి చెందిందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితురాలి భర్త కామేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారని, పోస్టుమార్టం అనంతరం చర్యలు తీసుకుంటామని జేసీ బాబూరావు చెప్పారు. 


ఫిట్స్‌ రావడంతోనే: స్వాతి ఫిట్స్‌ వల్లే మృతి చెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.బాబూలాల్‌ తెలిపారు. మంగళవారం ఫిట్స్‌ రావడంతో బెడ్‌పై నుంచి కిందపడిపోయిందని చెప్పారు. సిబ్బంది ఆమెను లేబర్‌వార్డుకు తరలించారని, సిబ్బంది నిర్లక్ష్యమేమీ లేదన్నారు.

ఉమ్మనీరు రక్తంలోకి చేరడం వల్లే..
సాక్షి, అమరావతి: ఉమ్మ నీరు రక్తంలోకి చేరడం వల్లే సమస్య తలెత్తి బాలింత మృతి చెందిందని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ బాబ్జీ తెలిపారు. ఆమె రక్తహీనతతో బాధపడుతోందని, డాక్టర్లు సాధారణ ప్రసవమే చేశారని చెప్పారు. అయితే మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఆమె స్పృహ తప్పి బెడ్‌ మీద నుంచి కింద పడిందని చెప్పారు.

మరిన్ని వార్తలు