విషాద యాత్ర

14 Jun, 2018 08:51 IST|Sakshi

భోగాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

రెండు లారీలు... ట్రావెల్స్‌ బస్సు ఢీ

పల్టీ కొట్టి బోల్తాపడిన యాత్రికుల బస్సు

సంఘటన స్థలంలోనే ముగ్గురి మృతి

మరో 46మందికి తీవ్ర గాయాలు

బాధితులందరూ విశాఖ జిల్లావాసులే

కాశీయాత్ర విషాదాంతం

పన్నెండు రోజులు... కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం... అంతా సవ్యంగానే సాగింది. కాశీ వంటి తీర్థయాత్రలను విజయవంతంగా చేసుకుని వచ్చారు. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం నుంచి ఓ బస్సులో బయలుదేరిన వీరంతా బుధవారం ఉదయం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్దకు చేరుకున్నారు. సముద్రస్నానాలు చేశారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే భోజనాలు పూర్తి చేసుకుని చివరిగా సింహాద్రప్పన్నను దర్శించి ఇళ్లకు చేరాలనుకుని బయలుదేరారు. ఇన్నాళ్ల ప్రయాణం వల్ల వచ్చిన బడలిక... వాతావరణం చల్లగా ఉండటం... కాస్త కడుపులో ఆహారం పడటంతో... అంతా చిన్నగా కునుకు తీస్తున్నారు. ఇంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారు ప్రయాణిస్తున్న బస్సు పల్టీ కొట్టింది. ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. అంతా బస్సులోనే ఇరుక్కున్నారు. తేరుకుని చూసేసరికి గాయాలతో అందరి ఒళ్లూ రక్తసిక్తమై ఉంది. తమతో ప్రయాణిస్తున్న ఓ ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరో 46మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ యలమంచిలి వాసుల విషాద యాత్ర.


భోగాపురం (విజయనగరం జిల్లా), యలమంచిలి రూరల్, మాకవరపాలెం : సుదీర్ఘ యాత్ర సవ్యంగా సాగింది. కానీ చివరికొచ్చేసరికి విషాదం నింపింది. తమతో ప్రయాణిస్తున్న ముగ్గురు బస్సులోనే ప్రాణాలు కోల్పోగా 46 మంది తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. ఐకమత్యంగా వెళ్లిన వారంతా... ఒక్క సంఘటనతో కకావికలమయ్యారు. ఇదీ బుధవారం మధ్యాహ్నం భోగాపురం మండలం జాతీయ రహదారి పోలిపల్లి జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఫలితం. యలమంచిలి, ఎస్‌.రాయవరం, మాకవరపాలెం, చిన్నగుమ్ములూరు, రాంబిల్లి, పోతిరెడ్డిపాలెం, జి.కోడూరు గ్రామాలకు చెందిన 43 మంది తోడుగా ఇద్దరు వంటపనివారను తీసుకుని ఈ నెల రెండో తేదీన కాశీయాత్రకు ఎస్‌ఎస్‌ టీఆర్‌ ట్రావెల్స్‌ బస్సులో బయలు దేరారు. పది రోజులపాటు దిగ్విజయంగా యాత్రలు పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లారేసరికి పూసపాటిరేగ సమీపానికి చేరుకోగానే చింతపల్లి వద్ద సముద్రంలో స్నానాలు చేసుకున్నారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే వంటలు పూర్తి చేసుకుని భోజనాలు చేసి అక్కడినుంచి సింహాచలం వెళ్లి వరాహనర్సింహస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు పోలిపల్లి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ డివైడర్‌ వద్ద ఒక్కసారిగా యూ టర్న్‌ తీసుకునేందుకు ఆగగా... దాని వెనుక వస్తున్న లారీ బలంగా ఢీకొంది. ఆ ధాటికి అదుపు తప్పిన లారీ ఎదురుగా యాత్రికులతో వస్తున్న బస్సును ఢీకొంది. బస్సు రెండు పల్టీలు కొట్టి తలకిందులైంది. అనుకోని సంఘటనతో యాత్రికులంతా ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.


అప్రమత్తమైన పోలీస్‌ సిబ్బంది
ప్రమాదం వార్త తెలుసుకున్న సీఐ రఘువీర్‌ విష్ణు, ఎస్‌ఐ తారకేశ్వరరావు సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవే విస్తరణ పనులు చేపడుతున్న వారికి సమాచారం అందించి మూడు జేసీబీలను తీసుకువచ్చి లారీలో, బస్సులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు సీట్లలో ఇరుక్కుపోయి ఊపిరాడక పోతిరెడ్డి పాలేనికి చెందిన కరణం వెంకన్న (45), కోడూరుకు చెందిన భీశెట్టి అచ్చియ్యమ్మ (50), కృష్ణాపురానికి చెందిన కలగాని అప్పలనర్సి(52)లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా ఎస్‌పీ పాలరాజు ప్రమాద స్థలానికి చేరుకుని హైవే పెట్రోలింగ్, అంబులెన్స్, బొలెరో ఇలా అన్ని వాహనాల్లో క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. తగరపువలస ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో 28 మందిని, విశాఖ కేజీహెచ్‌లో 9మందిని, విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి 7గురిని తరలిం చారు. వారంతా ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.


వెల్లకట్టలేని గ్రామీణుల సేవలు
ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న గ్రామస్తులు పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పిల్లా పాపలతో హాహాకారాలు చేస్తున్న యాత్రికులను స్థానిక యువకులు బస్సులోంచి బయటకు తీసుకువచ్చారు. వెంటనే గ్రామంలో ఉన్న పీహెచ్‌సీకి సమాచారం అందడంతో వైద్యాధికారి సునీల్‌ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని గాయాలపాలై రక్తం కారుతూ ఉన్న వారికి ప్రథమ చికిత్స చేశారు. వారికి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు. స్థానికంగా ఉన్న వెల్డింగ్‌ షాపు నుంచి సిబ్బంది వచ్చి కట్టర్‌ల ద్వారా బస్‌ సీట్లను, బాడీని కట్‌ చేసి ఇరుక్కున్న వారిని బయటకు తీశారు.
స్థానికంగా ఉన్న హనుమాన్‌ ఆలయ ధర్మకర్త కర్రోతు పైడిరాజు విద్యుత్‌ సరఫరాను అందించారు. స్థానికులు జనరేటర్‌ తీసుకువచ్చి, రోడ్డుపైన పడిఉన్న క్షతగాత్రులకు ఫ్యాను సౌకర్యం కలగజేసి ఉపశమనాన్ని అందించారు.  

మరిన్ని వార్తలు