వినోదం.. ఇక భారం

6 Feb, 2019 13:44 IST|Sakshi
టీవీ ప్రసారాలు వీక్షిస్తున్న వినియోగదారులు

ట్రాయ్‌ నిబంధనల కారణంగా పెరగనున్న కేబుల్‌ చార్జీలు

జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.12 కోట్ల భారం!

నేటి నుంచి నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు  

కర్నూలు (వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): సినిమా చూడడానికి కుటుంబమంతా థియేటర్‌కు వెళితే రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుంది. కొన్నాళ్లు ఆగితే ఆ సినిమా టీవీలో రాకపోతుందా అని పేద,మధ్య తరగతి కుటుంబాలు వేచిచూసేవి. ఇక నుంచి టీవీలో వచ్చినా అందరూ చూసే పరిస్థితి మాత్రం ఉండబోదు! చాలా వరకు చానెళ్లను..మరీముఖ్యంగా వినోదపు చానెళ్లను ప్యాకేజీలుగా ప్రసారం చేస్తుండడం, అన్ని చానెళ్లూ చూడాలంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావడమే ఇందుకు కారణం. కేబుల్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక సామాన్యులు సైతం టెలివిజన్‌తోనే వినోదం పంచుకునే అవకాశం వచ్చింది. నెలకు రూ.150 నుంచి రూ.250 వరకు కేబుల్‌ కనెక్షన్‌కు చెల్లిస్తే ఇంటిల్లిపాదీ సినిమాలు, సీరియళ్లతో కాలక్షేపం చేసే అవకాశం ఇప్పటివరకు ఉంది. 

ట్రాయ్‌ నిబంధనల నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌)  ప్రకటించిన కేబుల్‌ ప్రసార విధి విధానాలు సామాన్య, మధ్య తరగతి వినియోగదారులకు భారంగా పరిణమిస్తున్నాయి. ప్రేక్షకులు కోరుకున్న చానెళ్లను మాత్రమే ప్రసారం చేయాలని, వాటికి మాత్రమే చార్జీలు వసూలు చేయాల ని ట్రాయ్‌ ఆదేశించింది. వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా ఈ విధానాన్ని తెచ్చినప్పటికీ వివిధ చానెళ్లను ప్యాకేజీలుగా ప్రసారం చేస్తుండడం, వినియోగదారులు ఎక్కువగా చూస్తున్న చానెళ్లు వేర్వేరు ప్యాకేజీల్లో ఉండ డం మూలంగా ధర అమాంతం పెరిగిపోతోంది. ప్రస్తుతం జిల్లాలో కనిష్టంగా రూ. 150, గరిష్టంగా రూ.250 వరకు కేబుల్‌ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఈ మొత్తానికి 500 వరకు చానెళ్లను ప్రసారం చేస్తున్నారు. ట్రాయ్‌ నిబంధన కారణంగా ప్రస్తుతం ప్రసారమవుతున్న చానెళ్లన్నీ యథాత«థంగా వీక్షించాలంటే నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

నేటి నుంచి పే చానెళ్లు బంద్‌!
నూతన విధానం అమలుకు ట్రాయ్‌ గత డిసెంబర్‌ 31 గడువుగా ప్రకటించింది. ఆ తదుపరి జనవరి 31వరకు అవకాశం ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకోని కేబుల్‌ వినియోగదారులకు ప్రసారాలు నిల్చిపోతాయని తెలిపింది.  ట్రాయ్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం 100 ఫ్రీ ఛానెళ్లకు 18 శాతం జీఎస్టీతో రూ.153 చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు వేరే పే చానెళ్లను ఎంచుకుంటే వినియోగదారులపై మరింత భారం పడుతుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల కేబుల్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. ట్రాయ్‌ నిబంధనలు అమలు చేస్తే ఒక్కో కనెక్షన్‌పై ఎంతలేదన్నా నెలకు కనీసం రూ.200 భారం పడే అవకాశముంది.  ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.12 కోట్ల వరకు అదనంగా భరించాల్సి ఉంటుంది. తమకు కావాల్సిన వినోదం, సినిమాలు, క్రీడలకు సంబంధించిన చానెళ్లను ఆయా సంస్థలు నిర్ణయించిన ధర(ప్యాకేజీ)కు వినియోగదారుడు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా..ట్రాయ్‌ నిబంధనల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పే చానెళ్ల ప్రసారాలను కేబుల్‌ ఆపరేటర్లు నిలిపివేశారు. నేటి (బుధవారం) నుంచి  పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.   

పెరగనున్న చార్జీలు
ట్రాయ్‌ నిబంధనల ప్రకారం కేబుల్‌ టీవీ ప్రసారాలకు సంబంధించి చార్జీలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఇప్పుడు వీక్షిస్తున్న చానెళ్లన్నీ చూడాలంటే మూడు, నాలుగు రెట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం నుంచి నిబంధనలు పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి.  – రాజామధు, కేబుల్‌ ఆపరేటర్‌

పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారమే
కేబుల్‌ ప్రసారాల ధరలు అమాంతంగా పెంచడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారమే. అసలే నిత్యావసరాల ధరలు పెరిగి సతమతమవుతున్న తరుణంలో వినోదం కూడా భారం కావడం శోచనీయం. ప్రభుత్వం దృష్టి పెట్టి ఊరట కల్పించాలి. – కట్టా శేఖర్, కేబుల్‌ వినియోదారుడు, కర్నూలు

మరిన్ని వార్తలు