'రయ్‌'లు.. బస్సు

23 Nov, 2018 07:07 IST|Sakshi
బొబ్బిలి–సాలూరు మధ్య నడుస్తున్న రైలు బస్సు

భలే భలే రైలు బస్సు

10 రూపాయలతో సాలూరు ప్రయాణం

బొబ్బిలి–సాలూరు–బొబ్బిలి మధ్య సర్వీసు

రోజుకు 500 మంది ప్రయాణం

బస్సెక్కని వాడుండరు. రైలు తెలియని వారసలే ఉండరు. మరి.. రైలు బస్సు ఎక్కారా?.. అంటే.. కొత్తవారు ఆశ్చర్యపోతారు.. ఈ ప్రాంతీయులకు మాత్రమే చిరపరిచితమైన రైలు బస్సెక్కేందుకు ఇష్టపడతారు. పట్టాలపై నడిచే బస్సు లాంటి ఈ రైలు బొబ్బిలి నుంచి సాలూరుకు రోజూ వెళ్లి వస్తుంటుంది. ఈ మార్గంలో ప్రయాణించేవారు ఎక్కడ చెయ్యి ఎత్తినా బస్సులాగే ఆగిపోతుంది.  ప్రయాణికుల్ని ఎక్కించుకొని తిరిగి బయల్దేరుతుంది. రైలు బస్సులోనే టిక్కెట్లు వసూలు చేస్తుంటారు. పట్టాలపై నడుస్తున్నా.. బçస్సులో వెళ్తున్నట్టు అనుభవాన్ని మిగిల్చే రైలు బస్సుపై కథనమిది.               –

విజయనగరం, బొబ్బిలి రూరల్‌ :ఈస్టు కోస్టు రైల్వేలో బొబ్బిలిలోనే ప్రప్రథమంగా రైలు బస్సును 1996 మార్చి నెలలో ప్రవేశపెట్టారు. బొబ్బిలి నుంచి సాలూరుకు 17 కిలోమీటర్ల దూరం ఇది నడుస్తుంది. ఇక్కడ బ్రిటిష్‌ వారి కాలంలో 1836లో మిలిటరీ, పోస్టల్‌ రవాణా కోసం బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో సాలూరులో కూడా ఒక రైల్వే స్టేషనును నిర్మించారు. ఆంగ్ల పాలన ముగియడంతో ప్రయాణికుల కోసం రెండు బోగీలున్న రైలును రోజుకు రెండుసార్లు బొబ్బిలి నుంచి సాలూరు మధ్య నడిపేవారు. రైలు సిబ్బంది, గార్డులు, సాలూరు స్టేషను సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ ఖర్చు ఎక్కువవుతుండటంతో రైల్వేకు భారమైంది. దీంతో ఈ రైలును బస్సును ప్రవేశపెట్టి దశల వారీగా సాలూరు రైల్వే స్టేషన్‌ను ఎత్తివేసి బొబ్బిలి స్టేషన్‌లో విలీనం చేశారు. దీంతో ఇప్పుడు ఒక టీటీ, ఒక డ్రైవరుతో రోజుకు అయిదు పర్యాయాలు రాకపోకలను సాగిస్తోంది. బొబ్బిలి సాలూరు మధ్య సరైన రవాణా సదుపాయం లేకపోవడం, అతి తక్కువ వ్యయంతో రైలు బస్సు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

టిక్కెట్‌ ఖరీదు పది రూపాయలే
పది రూపాయలకు ఈ రోజుల్లో రైల్వే ప్రయాణం ఏమిటని ఆశ్యర్యపోకండి. ఇది నిజం. బొబ్బిలి నుంచి సాలూరుకు రూ.10కే రైలు బస్సులో ప్రయాణం చేయవచ్చు. బొబ్బిలి నుంచి  నారాయణప్పవలస, గొల్లలపేట, రొంపిల్లి పారన్నవలస, సాలూరులకు టికెట్‌ కూడా అతి తక్కువే. గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో నష్టాలైనా రైలు బస్సును విజయవంతంగా రైల్వే శాఖ నడుపుతోంది. బొబ్బిలిలో రైలుబస్సు ఎక్కేటప్పుడు రైల్వేస్టేషన్‌లో టిక్కెట్‌ తీసుకొని ఎక్కాలి. ఆ తరువాత తిరిగి బొబ్బిలి వచ్చే వరకూ రైలు బస్సులోనే టిక్కెట్లు ఇస్తారు.

రైలు బస్సు ప్రత్యేకతలు
బొబ్బిలికి వైడ్‌ రైలు బస్సులను రెండు కేటాయించారు.
దీనిలో మొత్తం 72 సీట్లు ఉంటాయి.
రోజూ 5 పర్యాయాలు ఈ బస్సు బొబ్బిలి నుంచి సాలూరు తిరుగుతుంది.
రోజూ 4 వందల నుంచి 5 వందల వరకు ప్రయాణిస్తారు.
ఈ మార్గంలో 170 మంత్లీ సీజనల్‌ టిక్కెట్లు తీసుకున్నారు. దానిలో 120 మంది విద్యార్థులే ఉంటారు.
850 లీటర్ల ఇంధన సామర్థ్యం ఉంది.
రోజుకు 50 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది.
ఇప్పటివరకూ ఇంధనం నింపేందుకు విజయనగరం ఫిల్లింగ్‌ పాయింట్‌కు వెళ్లేవారు. ఇప్పుడు దాదాపు 77 కిలోమీటర్ల దూరంలో ఉండే రాయగడ వరకూ వెళ్తున్నారు.

మరిన్ని వార్తలు