రైళ్లలో..దొంగల భయం..!

26 Jun, 2018 12:15 IST|Sakshi
ముంబాయి–చెన్నై మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు

ప్రయాణికులకు రక్షణ కరువు మళ్లీ రైళ్లల్లో చోరీలు

దొంగలకు కలిసివస్తున్నవేసవీ రద్దీ

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లే టార్గెట్‌

అసలే వేసవి సీజన్‌..ఈ సమయంలో రైలు ప్రయాణాలు అధికంగానే ఉంటాయి. యాత్రలు..పుణ్యక్షేత్రాల సందర్శన, పర్యాటక టూర్లుకు వేలాదిగా రైళ్లలో వెళుతుంటారు. బోగీలలో ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో దొంగలు ఏకంగా దోపిడీకి పాల్పడుతున్నారు. కిటికీల వద్ద ఉన్న వారి వద్ద నగలు చోరీ చేస్తున్నారు. రైలు రన్నింగ్‌లో పరారీ అవుతున్నారు. అయితే రైళ్లలో విధులు నిర్వర్తించే విషయంలో ఖాకీల సంఖ్య చాల తక్కువుగా ఉంది. ఇదే దొంగలకు కలిసివస్తోంది.

రాజంపేట/ కడప కోటిరెడ్డి సర్కిల్‌ : ఈనెల 23న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలు రిజర్వేషన్‌ బోగీలో కడపకు చెందిన ఫాతిమా ప్రయాణం చేస్తోంది. ఈమె బ్యాగులోని నగదు దోపిడీ చేశారని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జీఆర్పీలకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లాలో ఇటీవలన రెండు రైళ్ల దోపిడీ దొంగల బీభత్సం ఒక్కసారిగా రైల్వే ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. గుత్తి రైల్వే జంక్షన్‌ పరిధిలో రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోకి మరణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడిన సంఘటన రైల్వే రక్షక దళాలు, ప్రభుత్వ రైల్వే పోలీసులను కలవరపాటుకు గురిచేసింది. ఇదే రీతిలో రెండేళ్ల కిందట సూపర్‌పాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో హస్తవరం రైల్వేస్టేషన్‌లో దోపిడీకి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. రైళ్లలో నిత్యం చిన్నచిన్న చోరీలు ఆడపదడపా జరుగుతూనే ఉన్నాయి.

రద్దీగా నడుస్తున్న రైళ్లు
జిల్లా మీదుగా నడిచే రైళ్లలో ఇప్పుడు రద్దీ రైలు సామర్ధ్యంకన్నా అధికమైంది. జిల్లా మీదుగా అటు తిరుపతి, చెన్నై, కన్యాకుమారి, అటు ముంబాయి, కొల్హాపూర్, హుబ్లీ, కర్నూలు, హైదరాబాదు, నిజామాబాదు, కాచిగూడల రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రైళ్లన్నింటిలోనూ జనరల్‌ బోగీలతోపాటు రిజర్వేషన్‌ బోగీలు ప్రయాణికులు ఫుల్‌గా ఉంటున్నారు. ఒకొక్కసారి పార్శిల్‌ వ్యాన్‌లో కూడా ప్రయాణికులు ప్రయాణం చేయక తప్పడంలేదు.

అరకొరగా ఎస్కార్ట్‌
జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ విభాగాలకు చెందిన వారితో అరకొరగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అరకొరగా ఉన్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఒకొక్క స్టేషన్‌ నుంచి ఇద్దరు ట్రైన్‌గార్డ్స్‌ (బీట్‌కానిస్టేబుల్స్‌)గా విధులు నిర్వహిస్తున్నారు. ఒక బీట్‌లో 3 నుంచి 4 రైళ్లను కవర్‌ చేసే విధంగా డ్యూటీలు అమలు చేస్తున్నారు. వీరితో పాటు ఆర్‌పీఎఫ్‌ విభాగం నుంచి ఇద్దరు ఉంటారు. కనీసం ఒక బీట్‌కు నలుగురు జీఆర్పీ పోలీసులు, నలుగురు ఆర్పీఎఫ్‌ పోలీసులను ఒక బీట్‌లో వివిధ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కవర్‌ చేసే విధంగా ఉంటే ప్రయాణికుల భద్రత పటిష్టపరిచే విధంగా ఉంటందనేది ప్రయాణికులు వాదన. ఆర్‌పీఎఫ్‌ విభాగానికి చెందిన  వారి విధులు కూడా బలోపేతంగా లేవన్న విమర్శలున్నాయి.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లే దొంగల టార్గెట్‌
ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దొంగలు టార్గెట్‌ చేస్తున్నారు. టికెట్‌ తీసుకొని అనుమానం రాకుండా బోగీలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడతున్న దొంగలు కొందరు.. అలాగే రైళ్లను దారికాచి దోపిడీకి దిగుతున్నారు. ఇందులో రైళ్లను వ్యూహాత్మకంగా నిలిపివేసేందుకు పాల్పడి, ఆ తర్వాత బోగీ వద్ద ఒకరు వంగితే వానిపై మరొకరు ఎక్కి కిటీకీల పక్కన గాఢనిద్రలో ఉన్న వారి మెడలో నగలను దోచుకుంటున్నారు. అధికంగా ఉత్తరాదికి చెందిన ముఠాలే రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లుగా రైల్వే వర్గాల నుంచి వాదన వినిపిస్తోంది.

అమలు కానీ ఉత్తర్వులు  
రైళ్లల్లో దోపిడీ దొంగల బీభత్సం జరుగుతున్న జీఆర్పీ పోలీసులకు కాల్చివేత ఉత్తర్వులు అమలు కాలేదు.  ఎలాంటి అయుధాలు లేకుండా సిబ్బంది ఎస్కార్ట్‌ డ్యూటీకి వస్తున్నారు. అర్థరాత్రి 1గంట అవుతూనే స్లీపర్‌ క్లాస్‌లో ఎక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయో చూసుకుని నిద్రకు జారుకుంటున్నారు.

టీసీలు ప్రొత్సహిస్తున్నారు  
రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు జనరల్‌ టిక్కెట్లు తీసుకుని అనధికార వ్యక్తులను టీటీఏలు యథేచ్ఛగా ఖాళీ బెర్తులు లేకపోయినా లోపల కూర్చుంటామంటే ఫైన్‌ కట్టించుకుని అనుమతిస్తున్నారు. దీనివల్ల స్వీపర్‌ బోగీల్లో ప్రయాణికులకు భద్రత లేకుండా పోతోంది.

ఆ రైలుకు ఇద్దరే..  
చిత్తూరు నుంచి కాచిగూడకు వెళుతున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలులో కడప రైల్వేస్టేషన్‌ వరకు ఇద్దరు ఎస్కార్ట్‌గా వచ్చి కడపలో దిగుతున్నారు. 22 నుంచి 24లు బోగీలు ఉంటే 12 మంది ఎస్కార్ట్‌ సిబ్బంది ఉండాలి. కానీ ఇలా జరగడంలేదు.

మరిన్ని వార్తలు