రైలు పట్టాలపై.. రుధిర ధారలు

9 Jan, 2020 12:55 IST|Sakshi

ఏటా అధికమవుతున్న ఆత్మహత్యలు, ప్రమాదాలు

సిబ్బంది కొరతతో పర్యవేక్షణ కరువు

నివారణ మార్గాలపై దృష్టి పెట్టని వైనం

జిల్లాలో పెరుగుతున్న మృతుల సంఖ్య

పశ్చిమగోదావరి, నిడదవోలు: రైలు కిందపడి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల పాలకొల్లు రైల్వేస్టేషన్‌లో మలమంచిలి మండలం కాజా గ్రామానికి చెందిన పాలంకి వెంకట కిరణ్‌కుమార్‌ నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలు  సమాజంలో ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం కావడం, నమ్మిన వ్యక్తుల చేతుల్లో మోసపోవడం తదితర కారణాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వీరిలో చాలా మంది ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలను ఎంచుకుంటున్నారు. దీంతో పాటు ప్రమాదాల బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో రైలు మార్గాలు రక్తసిక్తమవుతున్నాయి. జీఆర్‌పీ పోలీసు సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ లేకపోవడంతో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏడేళ్లలో  జిల్లా వ్యాప్తంగా రైలు కింద పడి వందల సంఖ్యలో  ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలించారు.

ప్రమాదాలూ అధికమే
రైల్వేట్రాక్‌లు చాలా వరకు పొలాల సమీపంలో ఉండటంతో చాలా మంది బహిర్భూమికి పట్టాలు దాటుకుని పొలాల వైపునకు వెళుతున్న సమయంలో రైలు ఢీకొని మృతి చెందిన కేసులు చాలా వరకు ఉంటున్నాయి. రైలు ప్రయాణంలో చాలా మంది బోగి తలుపుల వద్ద కుర్చుని ప్రయాణించడంతో వేగానికి చల్లని గాలితగిలి నిద్రలోకి జారుకుని కిందకు పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు.

కొరవడిన పర్యవేక్షణ
ఒకప్పుడు పూర్తి స్థాయి సిబ్బందితో కళకళలాడిన రైల్వే పోలీస్‌ స్టేషన్లలో ప్రస్తుతం సిబ్బంది లేక ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. దీంతో రైల్వే మార్గాలలో పర్యవేక్షణ కొరవడుతోంది. జిల్లాలో తణుకు, నరసాపురం, పాలకొల్లు రైల్వే పోలీస్‌స్టేషన్లును ఎత్తివేసి భీమవరంలో స్టేషన్‌లో విలీనం చేశారు. వాటిని అవుట్‌పోస్టు ష్టేషన్లుగా ఉంచుతూ సిబ్బందిని తగ్గించారు. అదే విధంగా నిడదవోలు రైల్వేపోలీస్‌స్టేషన్‌ను తాడేపల్లిగూడెం స్టేషన్‌లో కలిపి దీన్ని అవుట్‌పోస్టుగా ఉంచేశారు. గత ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అవుట్‌పోస్టు  రైల్వేస్టేషన్‌పై చిన్నచూపు చూడటంతో ప్రయాణికుల  శాంతిభద్రతలు గాలిలో దీపంలా మారిపోతున్నాయి.

వేధిస్తున్న సిబ్బంది కొరత
నిడదవోలు అవుట్‌పోస్టులో ఒకప్పుడు 20 మంది రైల్వే పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ మాత్రమే  పనిచేస్తున్నారు. భీమవరం రైల్వేపోలీస్‌ స్టేషన్‌లో 20 మంది సిబ్బంది, ఎస్సై, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుల్స్‌ పని చేయాల్సి ఉండగా ఎస్సై, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుల్స్, ఆరుగురు కానిస్టేబుల్స్‌ మాత్రమే సేవలందిస్తున్నారు. తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైతో పాటు 19 మంది సిబ్బంది, ఇద్దరు హెడ్‌కానిస్టేబుల్స్‌ ఉండాల్సి ఉండగా  ప్రస్తుతం ఎస్సైతో పాటు 8 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నరసాపురం  రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఒక హెడ్‌ కానిస్టేబుల్, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. తణుకు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఒక  హెచ్‌సీ, నలుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక హెచ్‌సీ,  ఒక  కానిస్టేబుల్‌ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఏలూరు రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో మాత్రం ఎస్సై, హెచ్‌సీలు 03, ఏఎస్సై, 18 మంది సిబ్బందితో పూర్తిస్థ్ధాయిలో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రమాదాలకు కారణాలు
రైలు ఫుట్‌బోర్డుపై ప్రయాణాలు, రైలు పట్టాలపై బహిర్భూమికి వెళ్లడం , రద్దీగా ఉన్న రైలు ఎక్కి డోర్‌ వద్ద వేలాడటం, రైలు కదులుతున్నప్పుడు ఎక్కడం, అజాగ్రత్తగా దిగడం, రైల్వే క్రాసింగ్‌ వద్ద గేటు వేసి ఉన్నా పట్టాలు దాటడం ప్రమదాలకు కారణమవుతున్నాయి.

అప్రమత్తంగా ఉండాలి
రైలు ప్రయాణం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. రైలు డోర్‌ దగ్గర కూర్చుని చాలా మంది నిద్రమత్తులో  కిందపడిపోతున్నారు. కొంత మంది  క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరిలో చాలా మంది  20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. ప్రమాదాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడతాం. గుర్తు తెలియని మృతదేహాలను విచారించి వారి బంధువులకు అప్పగిస్తున్నాం.–ఏవీ ప్రసాదరావు, భీమవరం రైల్వే ఎస్సై

నివారణ మార్గాలు
రైల్వేసేషన్‌లో ప్లాట్‌ఫాంపై పట్టాలను దాటుకుని వెళ్లడాన్ని పోలీసులు నిరోధించాలి. ఆర్‌ఫీఎఫ్‌ సిబ్బంది అవసరమైతే ఫైన్‌ విధించాలి. లేదంటే కేసులు నమోదు చేయాలి.
రైల్వేస్టేషన్, రైల్వేగేట్ల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలి
రైల్వేస్టేషన్‌లో ఫుట్‌పాత్‌ వంతెనపై ప్రయాణికుల రాకపోకలు సాగించేలా రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవాలి.

>
మరిన్ని వార్తలు